
గంజాయి విక్రేతల అరెస్ట్
కల్లూరు: కల్లూరులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా, నిందితుల నుంచి 822 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ రఘు బుధవారం వివరాలు వెల్లడించారు. కల్లూరు ఎస్సై డి.హరిత మంగళవారం మధ్యాహ్నం తనిఖీలు చేస్తుండగా లక్ష్మీపురం రోడ్డులో ముగ్గురు యువకులు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో వీరిని వెంబడించి అదుపులోకి తీసుకోగా కల్లూరుకు చెందిన ఎస్‌కే.హమీద్, మణుగూరు సాయినగర్‌కు చెందిన ఎస్‌కే.హబీబ్‌పాషా, మిడియం గోవిందుగా తేలింది. గంజాయికి అలవాటు పడిన వీరు ఒడిశాకు వెళ్లి రూ.3,500 చొప్పున నాలుగు కేజీల గంజాయి కొనుగోలు చేశారు. అందులో కొంత సొంత అవసరాలకు ఉంచకుని, మిగతాది చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేసి గంజాయి, బైక్‌లు స్వాధీనం చేసుకోవడమే కాక గంజాయి ఉపయోగించిన 19 మందిని సీఐ ముత్తులింగం ఆధ్వర్యాన గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు.
●చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం బస్టాండ్ సమీపాన గంజాయి తాగుతున్న ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బి.వంశీని పోలీసులు బుధవారం ఆరెస్ట్ చేశారు. ఆయన వద్ద సిగరెట్ రూపంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.