
కుమారుడు అమెరికా చేరకముందే తండ్రి మృతి
చింతకాని: మధిర ఆర్‌టీసీ డిపో ఉద్యోగి రామిశెట్టి శ్రీనివాసరావు(53) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతికి ఆర్టీసీ అధికారుల ఒత్తిడే కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే, ఎంఎస్ చదివేందుకు కుమారుడిని మంగళవారమే అమెరికా విమానం ఎక్కించగా.. ఆయన అక్కడకు చేరకముందే తండ్రి మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం బుర్హాన్‌పురంలో నివాసముండే శ్రీనివాసరావు మధిర డిపో టైర్ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తుండగా పదోన్నతి వచ్చి ఏడాది పూర్తి కావొస్తోంది. ఆయన మంగళవారం సెలవులో ఉండగా, ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్నందున తప్పక విధులకు హాజరుకావాలని అధికారులు బుధవారం ఉదయం ఫోన్ చేసినట్లు తెలిసింది. అయితే, సమ్మెతో బస్సులు లేనందున రైలులో ఖమ్మం నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో చింతకాని చేరేసరికి ఆయన గుండెనొప్పి రావడంతో అక్కడే దిగి డిపో అధికారులకు ఫోన్ చేయగా ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుని విధులకు రావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో స్థానికుల సాయంతో పీహెచ్‌సీకి వెళ్లగా అక్కడ డాక్టర్ ఆల్తాఫ్ పరీక్షించి పరిస్థితి విషమంగా తేల్చి 108కు సమాచారం ఇచ్చారు. కానీ ఖమ్మం నుంచి 108 వాహనం వచ్చేలోగా గుండెపోటు రావడంతో వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేక మృతి చెందాడు. డిపో అధికారుల ఒత్తిడితోనే తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని శ్రీనివాసరావు భార్య రమాదేవి ఆరోపించారు. వీరి ఏకైక కుమారుడు రామ్‌చరణ్‌ను ఎంఎస్ చదివించేందుకు మంగళవారమే అమెరికా పంపించగా, ఆయన అక్కడకు చేరకముందే శ్రీనివాసరావు మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆర్టీసీ అధికారుల ఒత్తిడే కారణమని
కుటుంబీకుల ఆరోపణ