
అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి
ఖమ్మం అర్బన్: రహదారుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టడమే కాక సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం 15వ డివిజన్‌లో రూ.48.25 లక్షలతో నిర్మించే రెండు రహదారుల పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేలా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అయితే, రహదారుల నిర్మాణం నాణ్యతగా జరిగేలా ప్రజలు కూడా పర్యవేక్షించాలని సూచించిన మంత్రి, ఆతర్వాత పరిశుభ్రతపై దృష్టి సారించాలని చెప్పారు. అంతేకాక ప్రతీఒక్కరు ఇళ్ల ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్‌డీఓ జి.నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు రావూరి కరుణ, కమర్తపు మురళితో పాటు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్‌రెడ్డి, వాహిద్, రావూరి సైదబాబు, తుపాకుల ఏడుకొండలు, బోడా శ్రావణ్‌కుమార్, లక్ష్మణ్, లోడుగు వెంకన్న, సంక్రాంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు