
భగీరథ ప్రయత్నం!
ఎత్తిపోతలు ఇలా...
సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా 590 క్యూసెక్కుల నీటిని మధిర బ్రాంచ్ కెనాల్‌కు 51వ కిలోమీటర్ వద్ద ఎన్నెస్పీ కెనాల్‌లో ఎత్తిపోస్తారు. ఆ తర్వాత 51.7వ కిలోమీటర్ వద్ద తూము నిర్మించి ఒక ఫీడర్ కెనాల్ ద్వారా వైరా నదికి తరలిస్తారు(రిజర్వాయర్ దిగువకు). అలా వచ్చిన నీటిని వంగవీడు దగ్గర నిర్మించే చెక్ డ్యాం వద్ద నిల్వ చేస్తారు. ఆపై అక్కడ నిర్మించనున్న పంప్ హౌస్‌లోని మూడు పైప్‌లైన్ల ద్వారా రెండు మండలాలకు నీటిని తరలిస్తారు.
మధిర: పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమైన మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం మండలాలు సాగర్ ఆయకట్టు కింద జోన్–3లో ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి ఏపీకి నీరు వెళ్లాక అక్కడి నుంచి ఈ మండలాలకు చేరేలోగా విడుదల నిలిపివేస్తుండడంతో ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. ఈనేపథ్యాన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించగా ఈ పరిధిని జోన్–3 నుంచి జోన్–2కు మార్పు చేయించారు. అంతేకాక మధిర, ఎర్రుపాలెం మండలంలోని సుమారు 33వేల ఎకరాలకు సాఫీగా నీరు అందేలా జవహర్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. త్వరలోనే శంకుస్థాపన చేయనున్న ఈ పథకం ద్వారా రెండు మండలాల రైతుల ఇక్కట్లు తీరనున్నాయి.
ఇదీ ప్రాజెక్టు స్వరూపం
మధిర మండలంలోని వంగవీడు సమీపాన వైరా నదిపై చెక్‌డ్యాం నిర్మిస్తారు. అక్కడ జవహర్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని చివరి భూములకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఎత్తిపోతల పథకానికి రూ.630.30 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఈ ప్రాజెక్టు కింద మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని సాగర్ ఆయకట్టును స్థిరీకరిస్తారు. ఇందుకోసం 250ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్టును ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
పైప్‌లైన్ల ఏర్పాటు
వంగవీడు దగ్గర పంప్‌హౌస్ నుంచి మొదటి పైప్‌లైన్ ద్వారా11 కి.మీ. దూరంలోని నిధానపురం మేజర్‌లోకి నీరు ఎత్తిపోస్తారు. దీంతో మధిర మండలంలోని 17,309 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. ఈ జాబితాలో మధిర మండలంలోని అంబారుపేట, చిలుకూరు, దెందుకూరు, ఇల్లందులపాడు, ఖమ్మంపాడు, మధిర, మాటూరు, నాగవరప్పాడు, నిధానపురం, సైదల్లిపురం, సిద్ధినేనిగూడెం, తొండల గోపవరం, తొర్లపాడు గ్రామాలు ఉన్నాయి. అలాగే, 2, 3వ పైప్‌లైన్ల ద్వారా ఎర్రుపాలెం మండలంలోని మైలవరం, జమలాపురం మేజర్ కాల్వల్లోకి నీటిని లిఫ్ట్ చేస్తారు. మైలవరం మేజర్ కెనాల్ ద్వారా 5,093 ఎకరాలకు, జమలాపురం కెనాల్ ద్వారా 10,623 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. తద్వారా రెండు మండలాల్లోని 33,025 ఎకరాల చివరి భూములకు సైతం సాగునీరు సాఫీగా అందనుంది. ఈ భూములు ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం, రంగగూడెం, తాటిగూడెం, త్రిపురవరం, రేమిడిచర్ల, కేసిరెడ్డిపల్లి, జమలాపురం, ఎర్రుపా లెం, గుంటుపల్లి గోపవరం, భీమవరం, అయ్యవారిగూడెం, మామునూరు, చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు, పెద్ద గోపవరం, పెగళ్లపాడు, ఇనగాలి గ్రామాల్లో ఉన్నాయి.
‘జవహర్’ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు
4.66 టీఎంసీల నీరు సాగర్ కాల్వలకు తరలింపు
రూ.630.30 కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రణాళిక
మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చివరి ఆయకట్టుకు భరోసా
నష్టాలు ఎదురుకావు..
మేజర్ జోన్–3 చివరలో నిధానపురం ఉంటుంది. కాల్వకు సాగర్ నీరు రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన పంటలకు చివరలో నీరు అందక ఎండిపోతున్నాయి. లిఫ్ట్ పూర్తయితే మూడు పంటలు పండించి నష్టాలను అధిగమిస్తాం.
– చావలి బాలరాజు, రైతు నాగవరప్పాడు
మా కష్టాలు తీరతాయి...
సాగర్ కెనాల్ ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాలకు నీరు రావడం లేదు. రెండు, మూడేళ్లకోసారి కూడా నీరు అందక పంటలు నష్టపోతున్నాం. ఇప్పుడు మా గ్రామ సమీపాన నిర్మించే ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక్కడి రైతుల కష్టాలు తీరతాయి.
– ఐలూరి సత్యనారాయణరెడ్డి, రైతు వంగవీడు

భగీరథ ప్రయత్నం!

భగీరథ ప్రయత్నం!

భగీరథ ప్రయత్నం!