
పేదల ఆత్మగౌరవం కోసమే ఇందిరమ్మ ఇళ్లు
● రాజకీయాలకతీతంగా మంజూరు చేస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
మధిర: పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, ప్రతీ పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఆయన మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి విడతలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. గతంలో తన పాదయాత్ర సందర్భంగా ప్రజల బాధను నేరుగా తెలుసుకున్నానని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. 93లక్షల రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. నిరుపేదల పిల్లలకు నాణ్యమైన విద్య కోసం యంగ్ ఇండియా గురుకులాలు నిర్మిస్తున్నామని, గురుకులాల్లో 40 శాతం డైట్ చార్జీల పెంపుతో పాటు 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. రాజీవ్ యువ వికాసం కింద రూ. 8వేల కోట్లతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందించామని, రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేశామని, రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.12 వేల రైతు భరోసా అమలు చేస్తున్నామని అన్నారు.
వడ్డీ లేని రుణాలు..
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఒక్కో కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. మధిర ప్రాంత ప్రజలకు గౌరవం కలిగేలా పనిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్, ఇటుక తదితర సామగ్రి ధరలు పెరగకుండా మండల స్థాయి అధికారులు నియంత్రించాలని ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో 1,544 మంది పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అందించడం సంతోషంగా ఉందన్నారు. అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని, మొదటి విడతలో రాని వారు ఆందోళన చెందొద్దని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ ఎస్‌ఈ సరిత, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నర్సింహారావు, నాయకులు సూరంశెట్టి కిశోర్, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.