
అన్నదమ్ములను బలితీసుకున్న మున్నేరు
చింతకాని: ద్విచక్ర వాహనాలను శుభ్రం చేసేందుకు మున్నేటిలోకి దిగిన అన్నదమ్ములు గుంతలను గుర్తించకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. చేతికొచ్చిన కుమారుడొకరు.. ఇంజనీర్ చేయాల్సి ఇంకో కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చింతకాని మండలం చిన్నమండవలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాశీమల వెంకటి – సుభద్ర దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు నాగగోపి(22), చిన్నకుమారుడు నందకిశోర్(18) గ్రామానికే చెందిన గంటెల ప్రవీణ్, మోచర్ల రాజ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం మూడు ద్విచక్ర వాహనాలను శుభ్రపరిచేందుకు సమీపంలోని మున్నేటి వద్దకు వెళ్లారు. వాహనాలను శుభ్రం చేశాక స్నానానికి మున్నేటిలో దిగిన వారు ఇసుక కోసం తవ్విన గుంతలను గుర్తించక మునగసాగారు. ఈక్రమాన కేకలు వేస్తుండడంతో సమీపాన చేపలు పడుతున్న పట్టా బుజ్జిబాబు చేరుకుని ప్రవీణ్, రాజ్‌కుమార్‌ను బయటకు లాగాడు. మరింత లోతుకు వెళ్లిన నాగగోపి, నందకిశోర్‌ను కాపాడే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తులు చేరుకుని సుమారు మూడు గంటల పాటు గాలించినా ఫలితం దక్కలేదు. చివరకు తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగుల్‌మీరా ఖమ్మంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వగా.. అప్పటికే చీకటి పడడంతో కొందరు యువత మరింత లోతుకు వెళ్లి వెతకడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. నాగగోపి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేయగా, నందకిశోర్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నాడు. చేతికొచ్చిన కుమారులు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
ఇసుక కోసం తవ్విన గుంతల్లో మునిగి మృతి

అన్నదమ్ములను బలితీసుకున్న మున్నేరు