
ప్రజల దృష్టి మళ్లించేందుకే బనకచర్లపై రాద్ధాంతం
ఖమ్మంమయూరిసెంటర్: వాగ్దానాల అమలులో విఫలమైన కాంగ్రెస్, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీఆర్‌ఎస్ కలిపి బనకచర్ల ప్రాజెక్టుపై రాద్ధాంతం మొదలుపెట్టాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. ఇదే సమయాన ఏపీ, తెలంగాణ నడుమ వివాదాన్ని పెంచి పెద్ద చేసి పెద్దన్న పాత్ర పోషిస్తూ లబ్ధి పొందాలని కేంద్రప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలక, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అర్థం చేసుకుని ఉద్రేకాలకు గురికావొద్దని ఆయన కోరారు. కృష్ణా, గోదావరి నికర జలాల పంపిణీ హేతుబద్ధంగా జరగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మిగులు జలాల పంపిణీపై తెలంగాణ, ఏపీ అవసరాల ఆధారంగా కేంద్ర జలసంఘం రెండు రాష్ట్రాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈనెల 9న కార్మిక, రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన దేశ వ్యాప్త బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని రంగారారవు కోరారు. ఈ సమావేశంలో మాస్‌లైన్ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీ.వై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, కొల్లేటి నాగేశ్వరరావు, ఝాన్సీ, కె.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు