
ఫీజు బకాయిలు విడుదల చేయండి
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలలో జాప్యం చేయడం సరికాదని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి వి.వెంకటేష్ పేర్కొన్నారు. బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో నాయకులు గురువారం ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాల ముట్టడికి యత్నించారు. ఈక్రమాన పోలీసులు వారిని అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, రూ.వేల కోట్ల బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. ఇకనైనా బకాయిలు విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుచేసి ఉచిత బస్ పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు వినయ్, కార్తీక్, పృధ్వీ, సురేష్, నసీర్, చందు, అశోక్, ప్రసాద్, పేర్ల వెంకటేష్, నరేంద్ర, వరుణ్, సంతోష్, అఖిల్, స్టాలిన్, తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ ఆధ్వర్యాన
మంత్రుల కార్యాలయాల ముట్టడికి యత్నం