
నేత్రపర్వంగా జగన్నాథ రథయాత్ర
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలో బుధవారం జగన్నాథ రథయాత్ర నేత్రపర్వంగా సాగింది. ఇస్కాన్ ఆధ్వర్యాన వర్తక సంఘం కార్యాలయం వద్ద ప్రారంభమైన రథయాత్ర గాంధీచౌక్, కాల్వొడ్డు, జూబ్లీక్లబ్, మయూరిసెంటర్, పాత బస్టాండ్, వైరారోడ్, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ మీదుగా రోటరీనగర్ రాజరాజేశ్వరీదేవి ఆలయం వరకు సాగింది. ఆకర్షణీయంగా రథాన్ని అలంకరించి విష్ణువు రూపాలుగా భావించే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలనుప్రతిష్ఠించారు. ఆతర్వాత భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతుండగా.. దారి పొడవునా భక్తులు రంగురంగుల ముగ్గులు వేయడమే కాక కోలాట నృత్యాలు ప్రదర్శించారు. ఇస్కాన్ ప్రతినిధులు దేవదాసు, రామ్, అప్పారావు, ఈశ్వర్, కన్నోజు గురుబ్రహ్మం, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.