
లాభం ఎంత.. నష్టం ఎంత?
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో మున్నేరుపై నిర్మించిన చెక్‌డ్యాంలతో ఏ మేర వరద ముప్పు ఉంది... కొద్ది మేర ఎత్తు తగ్గించాలా, పూర్తిగా తొలగించాలా అన్న అంశంపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని జిల్లా జలవలనరుల శాఖ అధికారులను ఈఎన్‌సీ ఆదేశించినట్లు తెలిసింది. గత ఏడాది మున్నేటికి భారీగా వచ్చిన వరదతో ఖమ్మం నగరంతోపాటు రూరల్ మండలంలోని పలు కాలనీలు నీట మునిగాయి. అయితే, ఈ ముంపునకు ప్రకాష్‌నగర్ వద్ద మున్నేరుపై నిర్మించిన చెక్‌డ్యామే కారణమని కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు భావించారు. చెక్‌డ్యాం తొలగిస్తే వరద ముంపు ఉండదని ప్రతిపాదించగా.. ఇదే సమయాన చెక్‌డ్యాం ఉండడం వల్లే నగరంలో భూగర్భజలాలు పెరిగాయని ఇంకొందరు వాదన వినిపించారు. ఒకవేళ చెక్‌డ్యాం తొలగిస్తే రూ.7 కోట్ల నిధులు వృథా అవుతాయని వెల్లడించారు. ఖమ్మం ప్రకాష్‌నగర్ వద్ద ఎనిమిది అడుగులు, రంగనాయుల గుట్ట ప్రాంతంలో ఆరు అడుగుల ఎత్తులో చెక్‌డ్యాంలు ఉన్నాయి. ఈమేరకు రెండు చెక్‌డ్యాంలు కూల్చివేయాలా, రంగనాయుల గుట్ట చెక్‌డ్యాం మాత్రమే తొలగించాలా.. లేక ఎత్తు తగ్గిస్తే సరిపోతుందా అన్న అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాక చెక్‌డ్యాంల కింద ఆయకట్టు, ఉపాధి పొందుతున్న మత్స్యకారుల వివరాలు, వీటితో పెరిగిన భూగర్భ జలాల వివరాలను సైతం నివేదికలో పొందుపర్చాలని సూచించినట్లు సమాచారం. ఈమేరకు జిల్లా అధికారులు సమగ్రమైన నివేదిక రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలిసింది.
చెక్‌డ్యాంల కూల్చివేతపై నివేదిక ఇవ్వాలన్న ఈఎన్‌సీ