
సమ్మెతో కేంద్రం విధానాలపై నిరసన
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం తోట రామాంజనేయులు అధ్యక్షతన మంగళవారం నిర్వహించా రు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా మోడీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఈమేరకు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నందున సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసి కేంద్రానికి కనువిప్పు కలిగించాలని కోరారు. వివిధ పార్టీల నాయకులు కొండపర్తి గోవిందరావు, శింగు నర్సింహారావు, పోటు కళావతి, గాదె లక్ష్మీనారాయణ, సీతామహాలక్ష్మి, కళ్యాణం వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, కొత్తా సీతారాములు, మొక్కా శేఖర్ గౌడ్, ఎండీవై.పాషా తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం సమావేశంలో నాయకులు