
జానకీపురం హెచ్‌ఎంపై చర్యలకు ఆదేశం
బోనకల్: మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.శ్రీనివాసకుమార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా రూ.25వేల నిధులతో కొనుగోలు చేసిన క్రీడాసామగ్రి, బిల్లులపై ఆరా తీయగా అవన్నీ బీరువాలో ఉన్నాయని, తాళాలు సెలవులో ఉన్న పీఈటీ వద్ద ఉన్నాయని హెచ్‌ఎం చెప్పడంతో అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు శ్రీనివాసకుమార్ సరిపోందున ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనతరం పదో తరగతి విద్యార్థుల ప్రగతిని పరీక్షించిన అదనపు కలెక్టర్..బోధనపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఎంఈఓ దామాల పుల్లయ్య పాల్గొన్నారు.