
డంపింగే అసలు సమస్య...
కేఎంసీ సహా మున్సిపాలిటీలపై ‘చెత్త’ భారం
● సేకరిస్తున్న చెత్త తరలింపునకు ఇక్కట్లు ● ఖమ్మంలో డంపింగ్ యార్డ్‌ను మార్చాలని తరచూ ఆందోళనలు ● జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి
జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సహా సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలు నానాటికీ విస్తరిస్తున్నాయి. పల్లెల నుంచి జనాభా వస్తుండడంతో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ఆయా నివాసాల నుంచి రెండు రోజులు లేదా మూడు, నాలుగు రోజుకోసారి చెత్త సేకరిస్తున్నా.. ఈ చెత్త డంప్ చేయడంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లోనూ ఈ సమస్య నెలకొంది. ఖమ్మంలోని డంప్ యార్డును మార్చాలని సమీప కాలనీల ప్రజలు తరచూ ఆందోళనలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. చెత్త డంపింగ్, ఆపై నిర్వహణ లోపాలతో ఈ పరిస్థితి నెలకొనగా.. జిల్లాలోని కేఎంసీ సహా మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల
సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్.
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటా చెత్త సేకరణ రోజు విడిచి రోజు కొనసాగుతోంది. ఈ చెత్తను దశాబ్దాల కాలంగా దానవాయిగూడెంలోని 38 ఎకరాల్లో విస్తరించిన డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. కానీ తడి, పొడి చెత్త కలిపే వాహనాల్లో వేసి డంపింగ్‌యార్డ్‌కు తరలిస్తుండడం.. అక్కడ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోవడం, 60 డివిజన్ల నుండి చెత్త వాహనాల రాకపోకలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దానవాయిగూడెం డంపింగ్‌యార్డ్ చుట్టూ నివాసాల సంఖ్య పెరగడంతో కామంచికల్‌లోని ప్రభుత్వ స్థలంలో డంప్ చేయాలని నిర్ణయించారు. కానీ అక్కడ రైతులు అడ్డుకోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. మరోపక్క ఇంటింటా సేకరించిన చెత్తను రామన్నపేట మీదుగా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం రోడ్డు నుంచి ఒక మార్గం, రాపర్తినగర్ బీసీ కాలనీ మీదుగా మరో మార్గంలో వాహనాల్లో తరలిస్తుండగా.. దుర్వాసన వస్తోందని, చెత్త తమ ఇళ్ల ముందు పడుతోందని స్థానికులు పలుమార్లు వాహనాలను అడ్డుకొని నిరసనలు తెలిపారు. దీంతో ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై పట్టాలు కట్టిస్తామని అధికారులు చెప్పినా అది అమలుకు నోచుకోవడం లేదు.
బయోమైనింగ్..
ఖమ్మంలో 4లక్షల జనాభా నివసిస్తుండగా నివాసాలు, షాపుల నుంచి ట్రాక్టర్లు, ఇతరత్రా కలిపి 129 వాహనాల్లో చెత్త తరలిస్తున్నారు. రోజువారీగా 180 టన్నుల చెత్త సేకరిస్తున్నట్లు అంచనా. అయితే, డంప్ యార్డులో వ్యర్థాలు పేరుకుపోయి స్థలం లేకపోవడంతో అధికారులు బయోమైనింగ్ ప్రారంభించి పదెకరాలకు పైగా స్థలాన్ని శుభ్రం చేయించారు. ఇందులో ఎనిమిది ఎకరాల్లో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఏ రోజుకారోజు చెత్త శుభ్రం చేయించాలని ప్రణాళిక రూపొందించినా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇళ్ల ముందే చెత్త..
డంపింగ్‌యార్డ్‌కు వచ్చివెళ్లే చెత్త వాహనాలతో ఇబ్బందిగా ఉంది. తీవ్ర దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. చెత్త తీసుకెళ్లే వాహనాలపై పట్టాలు కట్టి రోడ్డుపై పడకుండా చూస్తామని అధికారులు చెప్పినా డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. దీంతో వ్యర్థాలు ఇళ్ల ముందు పడుతున్నాయి.
– చట్టు అఖిల్, బీసీ కాలనీ, ఖమ్మం

డంపింగే అసలు సమస్య...

డంపింగే అసలు సమస్య...

డంపింగే అసలు సమస్య...