చెల్లింపులు లేవు.. | - | Sakshi
Sakshi News home page

చెల్లింపులు లేవు..

Jul 2 2025 5:47 AM | Updated on Jul 2 2025 5:47 AM

చెల్ల

చెల్లింపులు లేవు..

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం నుండి నెలల తరబడి బిల్లులు రాకపోవడం.. అవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు రహదారి నిర్మాణ పనులను నిలిపివేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో రహదారులు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) ఆధ్వర్యాన చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోంది. జిల్లాలో రహదారులు, వంతెనలు, భవనాల నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర పనులు జరుగుతున్నాయి. అయితే, నెలల తరబడి ప్రభుత్వం నుండి చెల్లింపులు లేకపోవడంతో ఇకపై పెట్టుబడి పెట్టలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం నుంచి దశలవారీగా చెల్లించాల్సి ఉన్నా అలా జరకపోగా.. పూర్తయిన పనులకు కూడా బిల్లులు అందడం లేదని సమాచారం.

ఖమ్మం–ఇల్లెందు రోడ్డు విస్తరణకు బ్రేక్‌

ఖమ్మం–ఇల్లెందు మార్గంలో రఘునాథపాలెం నుంచి బూడిదంపాడు వరకు సుమారు రూ.40 కోట్ల అంచనాతో నాలుగు లేన్లుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అయితే, పనులు మొదలై ఏడాది కావొస్తున్నా ప్రారంభ దశలోనే ఉన్నాయి. సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.5కోట్ల మేర బిల్లు బకాయి ఉండడంతో పనులు నిలిపివేసినట్టు సమాచారం. రోడ్డు పనులకు వినియోగించే యంత్రాలను సైతం అక్కడి నుంచి తరలించడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, స్థానిక అధికారుల ఒత్తిడితో ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా కల్వర్టుల వద్ద మాత్రం చిన్నచిన్న పనులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఖమ్మంలో రూ.200 కోట్ల నిధులతో తీగల వంతెన నిర్మిస్తుండగా కాంట్రాక్టర్‌కు సుమారు రూ.20 కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉన్నట్లు తెలిసింది. పని చేస్తున్నా బిల్లులు రాకపోవడంతో అప్పులు పెరిగినందున ఇకపై చేయలేమంటూ కొద్దిపాటి పనులతో సరిపెడుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవన సముదాయం కాంట్రాక్టర్‌కు సైతం రూ.15 కోట్ల మేర బిల్లులు అందాల్సి ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.100 కోట్ల వరకు బిల్లులు బకాయి ఉన్నట్లు సమాచారం. ఇక పూర్తయిన పనులన్నీ కలిపితే ఈ బకాయి భారీగా ఉంటుందని తెలిసింది.

ప్రభుత్వ స్పందనపైనే ఆశలు

ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో చేసిన పనులకు సంబంధించి బకాయిలు ఎప్పుడు విడుదల అవుతాయనే విషయంలో అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారని తెలిసింది. దీంతో కాంట్రాక్టర్లు చేసేదేం లేక పనులను మధ్యలో నిలిపివేస్తున్నారు. బకాయిల్లో కొంత మొత్తమైనా చెల్లిస్తేనే కాంట్రాక్టర్లు కొత్త పనులకు టెండర్లు దాఖలు చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈనేపథ్యాన ప్రభుత్వ స్పందన కోసం అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు.

భారం మోయలేమంటున్న

ఆర్‌అండ్‌బీ కాంట్రాక్టర్లు

రూ.100 కోట్లకు పైగా

బిల్లులు పేరుకుపోవడంతో నిరాశ

ఫలితంగా నిర్మాణాల్లో జాప్యం..

కొత్త పనులపై నిర్వేదం

ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగే...

మిగతా జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో పనులు మెరుగ్గానే జరుగుతున్నాయి. ఎక్కడా కాంట్రాక్టరు పనులు నిలిపివేసినట్లు సమాచారం లేదు. అయితే, బిల్లుల కోసం మాత్రం ఒత్తిడి చేస్తున్నారు. పూర్తయిన, వివిధ దశల్లో ఉన్న పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమర్పిస్తున్నాం.

– యాకూబ్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ

కొత్త పనులు కష్టమే..

ఇప్పటికే జిల్లాలో పూర్తయిన, పురోగతిలో ఉన్న పనులకు రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌ ఉన్నట్లు సమాచారం. ఈ నిధుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్న నేపథ్యాన కొత్త పనులకు పదేపదే టెండర్లు జారీ చేస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయమై అధికారులు ఆరా తీస్తే పాత బిల్లులే ఇవ్వనప్పుడు కొత్త పనులు ఎలా చేస్తామని కాంట్రాక్టర్లు బదులిచ్చినట్లు తెలిసింది. అప్పుల్లో కూరుకుపోయిన తమకు ఇప్పటివరకు చేసిన పనుల బిల్లులు చెల్లించాకే టెండర్లపై ఆలోచన చేస్తామని చెప్పినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నట్లు తెలిసింది.

చెల్లింపులు లేవు..1
1/1

చెల్లింపులు లేవు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement