
పోషకాహారంతో విద్యార్థుల ఎదుగుదల
రఘునాథపాలెం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తూనే నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని, తద్వారా వారి ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో తెలుగు పద్యాలు, ఆంగ్లం పాఠాలు చదివించి వారి సామర్థ్యాలను పరిశీలించారు. ఆతర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ మాట్లాడుతూ పాఠాలు చెప్పడం ఎంత ముఖ్యమో ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించడాన్ని కూడా ఉపాధ్యాయులు బాధ్యతగా భావించాలని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేసిన కలెక్టర్ ఓపీ గది, మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, ఉద్యోగుల హాజరును పరిశీలించారు. అలాగే, చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో డీఈఓ సత్యనారాయణ, ఎంఈఓ రాములు, హెచ్‌ఎం కరుణకుమారి, వైద్యులు పాల్గొన్నారు.
ఆరోగ్యంగా ఉంటే అంతా మంచే...
ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యం బాగా ఉంటే ఏ సమస్యనైనా అవలీలగా అధిగమించొచ్చని కలెక్టర్ అనుదీ ప్ దురిశెట్టి తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యవృత్తి పవిత్రమైనదని, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్యులకు తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని తెలిపారు. ఈమేరకు విధినిర్వహణలో వారికి జిల్లా యంత్రాంగం నుంచి వందశాతం మద్దతు అందిస్తామని చెప్పా రు. అనంతరం వైద్యులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేయగా, సీనియర్ వైద్యులను సన్మానించారు. డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, వైద్యులు కృపాఉషశ్రీ, నారాయణరావు, జగదీష్, బి.శ్రీనివాసరావు, చందునాయక్, వెంకటరమణ, బి.సైదులు, శ్రీరామారావు, మోతియా, రచ్చ శ్రవణ్ కుమార్, రమేష్, రత్నమనోహర్ పాల్గొన్నారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన
కలెక్టర్ అనుదీప్