No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 31 2024 12:14 AM

-

భూమికి పదును రావడంతో..

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో భూమికి పదును రావడంతో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. అయితే మరో వారం నుంచి 15 రోజుల్లో వర్షాలు కురిస్తే కానీ పత్తి విత్తనాలు వేసే పరిస్థితి లేదు. రైతులు మాత్రం దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2,01,834 ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇక దుక్కులు సిద్ధం చేసిన రైతులు పత్తి విత్తనాల కోసం దుకాణాల బాట పట్టారు.

అందుబాటులో విత్తనాలు..

సాగులో రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను సీజన్‌ కన్నా ముందుగానే అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవసరమైన మొత్తం విత్తన ప్యాకెట్లు దాదాపుగా చేరుకున్నాయి. ఒక్కో ఎకరానికి రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయి. 475 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.864 ఉంటుంది. జిల్లాలో సాగవుతున్న 2,01,834 ఎకరాలకు 4 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం. ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్న జిల్లా అధికార యంత్రాంగం మొత్తంగా 5.60 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు తెప్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు జిల్లాకు చేరాయి. వీటిలో 45 వేల ప్యాకెట్లను విక్రయించారు. వర్షాలు కురిసి సీజన్‌ ప్రారంభమైన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

ఆ..కంపెనీ విత్తనం కోసం..

పత్తి విత్తనాల్లో 200 నుంచి 300 రకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒకే రకం కంపెనీ విత్తనానికి డిమాండ్‌ పెరిగింది. అధిక దిగుబడి వస్తుందన్న కారణంతో ఈ విత్తనం కావాలని రైతులు ఎగబడుతున్నారు. దిగుబడిని ఇచ్చే విత్తన రకాలు అనేకం మార్కెట్‌లో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులకు కావాల్సిన మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచామని, ఒకే రకం విత్తనాలు అధిక దిగుబడిని ఇస్తాయనే ఆలోచన మానుకోవాలని సూచిస్తున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాలు జిల్లాకు 10 వేల ప్యాకెట్లు రాగా ఇవి హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ రకం విత్తనాల కోసం రైతులు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రైతులు వీటినే కోరుతుండటంతో నిల్వ ఉండడం లేదు. దీంతో కొన్ని చోట్ల ఒక్కో రైతుకు ఒకటి, రెండు ప్యాకెట్లు మాత్రమే ఇస్తుండడంతో దుకాణాల వద్ద భారీ క్యూలు దర్శనం ఇస్తున్నాయి. కొందరు రైతులు ఇక్కడ అందుబాటులో లేవని గుంటూరు, విజయవాడ, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ రకం విత్తనాలు తెచ్చుకుంటున్నారు.

ఇతర రకాలనూ

కొనుగోలు చేయండి..

ఒకే రకం పత్తి విత్తనాల కోసం వేచి ఉండకుండా.. ఇతర రకాలైన మంచి పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇతర రకాలు కూడా మంచి దిగుబడిని ఇస్తాయని అంటున్నారు. యూఎస్‌ 7067 రకానికి జిల్లాలో బాగా డిమాండ్‌ ఉంది. అయితే ఇతర పత్తి విత్తన రకాలైన యూఎస్‌ 4708, యూఎస్‌ 4753, యూఎస్‌ 704, రాశి స్విఫ్ట్‌, ఆర్‌సీహెచ్‌ 797, ప్లాటినం, సంధ్య గోల్డ్‌, ఆదియా, రేవంత్‌, మైకో (బహుబలి), డన్‌దేవ్‌ఫ్లమ్‌, జంగి, ఎంఆర్‌సీ 7373, ప్రదీప్‌, రన్‌ధీర్‌, తులసి 07, అంకుర్‌, నవనీత్‌, జీహెచ్‌ 0029 వంటి రకాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే వీటితోపాటు ఇంకా అనేక రకాల పత్తి విత్తన ప్యాకెట్లు గతంలో దిగుబడిని ఇచ్చినవి చూసుకుని కొనుగోలు చేసుకోవచ్చునని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఒకటే కంపెనీ, ఒకే రకానికి చెందిన పత్తి విత్తనాల కోసం రైతులు పోటీ పడొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement