జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన | Sakshi
Sakshi News home page

జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Published Fri, May 31 2024 12:14 AM

జిల్లాలో నేడు మంత్రి  పొంగులేటి పర్యటన

ఖమ్మంవన్‌టౌన్‌/తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారం, పైనంపల్లి, జూపెడ, కాకారవాయి, సుద్దవాగు తండా, ముజాహిద్‌పురం, ఏనెకుంట తండా, మంగళిబండ తండా, రఘునాథపాలెం గ్రామాల్లో పొంగులేటి పర్యటిస్తారని వివరించారు. ఆయా గ్రామాల ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సూచించారు.

నిర్ణీత తేదీల్లో గోల్కొండ, శాతవాహన రైళ్లు రద్దు

రేపటి నుంచి అమల్లోకి..

ఖమ్మం రాపర్తినగర్‌ : దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తున్న మూడో లైన్‌ పనుల కారణంగా ఖమ్మం మీదుగా వెళ్లే గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఖమ్మం రైల్వే కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి ఎండీ జాఫర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ జూన్‌ 1, 2, 5, 6, 8, 9 తేదీల్లో, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12713), సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12714) రైలును కూడా జూన్‌ 1, 2, 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేసినట్లు వివరించారు.

ౖపైపెకి పాతాళ గంగ..

ఖమ్మంవన్‌టౌన్‌: ఎండలు మండుతున్నాయి. గత కొన్ని రోజులుగా శాంతించిన భానుడు రెండు రోజులుగా తిరిగి ఉగ్రరూపం దాల్చాడు. బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. అయితే ఇటీవల ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురవడంతో భూమి పొరల్లో నిక్షిప్తమైన గంగమ్మ కొన్ని మండలాల్లో ౖపైపెకి వస్తోంది.

స్వల్పంగా పెరిగిన మండలాలివే..

ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా ఇటీవల కొన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో భూగర్భజలాలు స్వల్పంగా పెరిగాయి. బోనకల్‌ మండలంలో 0.34, ముదిగొండ 0.25, కొణిజర్ల 0.71, సింగరేణి 1.88, కామేపల్లి 0.06, ఎర్రుపాలెం 1.83, రఘునాథపాలెం 0.46, సత్తుపల్లి 1.26, వేంసూరు 0.87,తల్లాడ 0.14, ఏన్కూరులో 1.11 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. జిల్లాలో సగటున 0.26 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ఇక త్వరలో వర్షాలు పడితే భూగర్భ జల నీటిమట్టం మరింతగా పెరగనుంది.

నేటి నుంచి వెండితెర వెలుగులు

తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

ఖమ్మం గాంధీచౌక్‌: పది రోజులకు పైగా మూతబడి ఉన్న థియేటర్లు శుక్రవారం తెరుచుకోనున్నాయి. ప్రేక్షకులు రాకపోవడంతో ఈనెల 17 నుంచి సినిమా హాళ్లను మూసి ఉంచుతున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి మూతబడిన హాళ్లను తిరిగి తెరవాలని అసోసియేషన్‌ గురువారం నిర్ణయించడంతో శుక్రవారం నుంచి తిరిగి సినిమాలు ప్రదర్శించనున్నారు.

సమాజం కోసం

పాటుపడితే జన్మధన్యం

అన్నపురెడ్డిపల్లి: భగవంతుడిని విశ్వాసంతో ఆరాధించి, సమాజం కోసం పాటుపడితే జన్మధన్యవుతుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామి ప్రవచించారు. గురువారం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివా రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. బాలాజీ వేంకటేశ్వర స్వామివారి విశిష్టతను వివరించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వికాస తరంగిణి సమాజానికి సేవలందిస్తోందని, పిల్లలు, మహిళల ఆరోగ్యం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. సమాజం కోసం పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. తొలుత చిన్నజీయర్‌ స్వామివారికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దంపతులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ పాకాల రమణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement