‘శాయ్‌’ స్టేడియం హుళక్కేనా! | Sakshi
Sakshi News home page

‘శాయ్‌’ స్టేడియం హుళక్కేనా!

Published Mon, May 27 2024 5:50 PM

-

● ఆధునాతమైన స్టేడియంపై నీలినీడలు ● 18 ఎకరాలు కేటాయించినా సమయానికి స్పందించని యంత్రాంగం ● ఫలితంగా అదే భూమి ప్రభుత్వ కళాశాలకు బదలాయింపు ● శాట్స్‌ పట్టింపులేని తనం, నిర్లక్ష్యమే కారణం

ఖమ్మంస్పోర్ట్స్‌: జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి పాటుపడుతున్నామని అటు పాలకులు, ఇటు అధికారులు చెబుతున్న మాటలు అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లి శివారులో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) ఆధ్వర్యాన స్టేడియం నిర్మాణ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శమని క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 జూన్‌ నెలలో ఆర్భాటంగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి చెందిన ఇద్దరు పరిశీలకులు జిల్లాకు పలుమార్లు వచ్చి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలం అనుకూలంగా ఉందని చెబుతూ తమకు అప్పగిస్తే అధునాతత స్టేడియం నిర్మిస్తామని జిల్లా యంత్రాంగానికి నివేదిక అందజేశారు. ఆపై ఉలుకూ పలుకు లేకపోవడంపై క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మల్టీపర్పస్‌ స్టేడియం

మద్దులపల్లిలో స్టేడియం నిర్మాణం కోసం 18 ఎకరాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం కేటాయించింది. కానీ శాయ్‌ బాధ్యులు కానీ జిల్లా అధికారులు కానీ ఎందుకో పట్టించుకోలేదు. స్థలపరిశీలన చేసి నివేదిక సిద్ధం చేశాక కాస్త శ్రద్ధ చూపితే ఈ స్థలంలో ఆధునాతన స్టేడియం సిద్ధమయ్యేది. రూ.25 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్‌ స్టేడియంగా నిర్మిస్తే క్రికెట్‌, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వాలని భావించారు. కానీ స్థలం సేకరించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. అయితే, నిధుల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సుముఖంగా లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదని తెలుస్తోంది.

ఇప్పుడు మినీ స్టేడియం..

ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలో మల్టీపర్పస్‌ స్టేడియం నిర్మాణం విషయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ ప్రతిపాదనలు పక్కన పడినట్లు సమాచారం. దీని స్థానంలో మినీ స్టేడియం నిర్మిస్తామని ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరిలో ఐదెకరాల భూమి కేటాయించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. కానీ జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి అవకాశామున్న అధునాతన స్టేడియం నిర్మాణం జరగకపోవడం మాత్రం అభిమానులకు గట్టిదెబ్బగా భావిస్తున్నారు.

రెండుసార్లు శాయ్‌ విఫలం

జిల్లా కేంద్రంలో సీక్వెల్‌ రిసార్ట్స్‌ పక్కన ఉన్న రెండెకరాల ఖాళీ స్థలాన్ని 2016లో అప్పటి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు ఆర్చరీ సెంటర్‌ కోసం పరిశీలించారు. కానీ ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఆర్చరీ సెంటర్‌ను తిరిగి సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోనే ఏర్పాటు చేశారు. తిరిగి 2019లో మరోమారు ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలోని 18 ఎకరాల్లో అధునాతన స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించినా అధికారులతో తీరుతో అదీ రద్దయింది. ఇక ఈ స్థలంలో జిల్లాకు మంజూరైన ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ లేదా జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలు నిర్మించాలనే యోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రెన్యూవల్‌ చేయకపోవడమే కారణమా?

క్రీడారంగం అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నెలకొల్పాల్సిన ఆధునాతన స్టేడియం నిర్మాణంపై ఆశలు పూర్తిగా గల్లంతైనట్లేనని తెలుస్తోంది. స్థలం కేటాయింపు, ప్రతిపాదనల తయారీకి సంబంధించి జిల్లా యంత్రాంగం, శాట్స్‌ ప్రతీ మూడేళ్లకోసారి రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉన్నట్లు సమాచారం. కానీ శాట్స్‌ అధికారులు ఒకటి, రెండు సార్లు పరిశీలించి ఆపై పట్టించుకోకపోవడంతో స్టేడియం ప్రతిపాదనలు బుట్టదాఖలైనట్లు తెలిసింది. అధికారులు మొదటి మూడేళ్లలోపు స్పందిస్తే జిల్లాలో మరో అధునాతన స్టేడియం అందుబాటులోకి వచ్చేది. అది జరగకపోవడంతో ఇప్పుడు ఖమ్మం రూరల్‌ మండలం వెంకటగిరిలో నిర్మిస్తున్న మినీ స్టేడియంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement