నేటి నుంచి రైతులకు అవగాహన సదస్సులు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రైతులకు అవగాహన సదస్సులు

Published Fri, May 24 2024 6:35 AM

నేటి నుంచి రైతులకు అవగాహన సదస్సులు

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంట సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యాన ప్రభుత్వం విత్తనాల విక్రయంపై దృష్టి సారించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈమేరకు విత్తన విక్రయాల్లో అక్రమాలు జరగకుండా, నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఈక్రమంలో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రఘునందన్‌రావు, కమిషనర్‌ డాక్టర్‌ బి.గోపి హైదరాబాద్‌ నుంచి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈసమావేశానికి జిల్లానుంచి జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల, ఏడీఏలు శ్రీనివాసరెడ్డి, సరిత, ఏ.శ్రీనివాసరావు, కొంగర వెంకటేశ్వరరావు, కరుశ్రీ, ఎస్‌.విజయచంద్ర, యూ.నర్సింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ శుక్రవారం నుంచి గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 7–30 నుంచి 11–30 గంటల వరకు రోజుకు రెండు గ్రామాల్లో నిర్వహించే సమావేశాల్లో ఏఓలు, ఏఈఓలు పాల్గొని రైతులకు సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు రైతులకు వివరించాల్సిన అంశాలపైనా అధికారులు దిశానిర్దేశం చేశారు. అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, గ్రామాలకు వచ్చి లూజ్‌గా విక్రయించే వారిని నమ్మొద్దని, ప్రతీ కొనుగోలు సందర్భంగా ప్యాకెట్‌పై అన్ని వివరాలు పరిశీలించడమే కాక రశీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకునేలా రైతులకు అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

నేడు డీలర్ల సమావేశం

కలెక్టరేట్‌లో శుక్రవారం విత్తన డీలర్లు, విక్రయదారుల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. విత్తన అమ్మకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై చర్చించనున్న ఈ సమావేశంలో కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని డీలర్లు, వ్యవసాయాధికారులు మధ్యాహ్నం 3గంటలకు మొదలయ్యే సమావేశానికి హాజరుకావాలని డీఏఓ విజయనిర్మల సూచించారు.

వీసీలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు

Advertisement
 
Advertisement
 
Advertisement