వానొస్తే మునకే! | Sakshi
Sakshi News home page

వానొస్తే మునకే!

Published Sat, May 18 2024 2:25 AM

వానొస

● భద్రగిరిలో కానరాని ముందస్తు నివారణ పనులు ● స్లూయీజ్‌ల పటిష్టతకు చేపట్టని చర్యలు ● శాశ్వత మోటార్లు ఏర్పాటు చేయాలంటున్న బాధితులు

పటిష్టతకు ప్రణాళికలేవి ?

ప్రధానంగా పట్టణంలోని వరద నీటితో పాటు విస్తా కాంప్లెక్స్‌, ఇతర ప్రాంతాల్లోని స్లూయీజ్‌ల వద్ద నీటిని తోడేందుకు ఈ సీజన్‌లో మోటార్లను అద్దెకు తీసుకొస్తుంటారు. అయితే రామాలయం వద్ద ఉన్న స్లూయీజ్‌ల్లో నీటి తోడకానికి మాత్రం భారీ మోటార్లు అవసరం కావడంతో అదనంగా సింగరేణికి చెందిన ఇంజన్లను సైతం వినియోగిస్తుంటారు. భారీగా చేరిన వరదను తోడే క్రమంలో మోటార్లు మొరాయిస్తుంటాయి. దీంతో పట్టణంలో కురిసే చిన్నపాటి వర్షానికే ఆ ప్రాంత ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. అయితే ప్రతి యేటా స్లూయీజ్‌ల లీకేజీకి, పటిష్టతకు చర్యలు చేపడతామని అంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఏడాది ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక రూపొందించిన దాఖలాలు లేవు. దీనికి తోడు కరకట్ట సైతం పలు ప్రాంతాల్లో దెబ్బ తిన్నది. ప్రధానంగా నీటిని ఎత్తి గోదావరిలో కలిపే ప్రాంతాలలో రివైలింగ్‌ సైతం క్రమంగా కొట్టుకుపోతోంది. వర్షాకాలం సమీపిస్తున్నందున ఇకకై నా అధికారులు చర్యలు చేపట్టకుంటే మళ్లీ నష్టం తప్పదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

భద్రాచలం: భద్రాచలంలో పెద్ద వర్షం వచ్చినా.. గోదావరికి వరదలు సంభవించినా.. ముందుగా వరదనీరు చేరేది రామాలయం పరిసర ప్రాంతాలే. చినుకు పడిందంటే దేవస్థానం చుట్టుపక్కల గల చిరు వ్యాపారులు, స్థానికులు వణికిపోతున్నారు. చుట్టూ నీరు చేరడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక కూడా తగ్గుతుండడంతో ఆలయం వెలవెల బోతుంది. ఇది ప్రతి యేటా నిత్యకృత్యమే అవుతోంది. వర్షాకాలంలో హడావిడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలో చిత్తశుద్ధి చూపడం లేదు. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని స్థానికులు ఇప్పటి నుంచే భయపడుతున్నారు.

నివారణ చర్యల్లో నిర్లక్ష్యం..

భద్రాచలం వద్ద సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు గోదావరి వరదలు సంభవిస్తుంటాయి. నదిని వరద ముంచెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో పునరావాస శిబిరాలకు తరలివెళ్లాల్సి వస్తుంది. అయితే భద్రాచలంలో మాత్రం పరిస్థితి మరో తీరుగా ఉంటుంది. వరదలు వచ్చిన సమయంలో పట్టణంలోని వరద నీరు, మురుగు నీరు గోదావరిలో కలిసేందుకు కరకట్టల వద్ద ఏర్పాటు చేసిన స్లూయీజ్‌లను మూసివేస్తారు. దీంతో రామాలయం, విస్తా కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్న పట్టణ వరదనీటితో స్వామివారి అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్‌, చప్టా దిగువ ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇక సుభాష్‌ నగర్‌, కొత్త అశోక్‌నగర్‌ కాలనీ ప్రాంతాల వైపు ఏర్పాటు చేసిన స్లూయీజ్‌ల లీకేజీతో వాటితో పాటు పలు కాలనీల్లోకి వరద నీరు చేరుతుంది. ఇలా మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన ప్రతి సారి ఈ సమస్య భద్రాచలాన్ని వేధిస్తూనే ఉంటుంది. దీంతో ఒక్కోమారు అర్ధరాత్రి ఊహించకుండా వచ్చే నీటితో కాలనీ వాసులు ఇళ్లలో సర్వం కోల్పోయి శిబిరాల్లో తలదాచుకున్న సందర్భాలు గత రెండేళ్లలోనే అధికంగా ఉన్నాయి. ఇలా ప్రతి ఏడాది వర్షాకాలంలో పలుమార్లు ఈ సమస్య ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెడుతుంటుంది. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఏర్పడుతున్నా పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మే నెల సగం గడిచింది. జూన్‌ నుంచి వర్షాకాలం ప్రారంభం కానుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏటా నష్టపోతూనే ఉన్నాం

వర్షాకాలంలో వచ్చే వరదతో ప్రతి ఏటా నష్టపోతూనే ఉన్నాం. ఇటీవల కొద్దిపాటి వర్షం వచ్చినా నీరు చేరుతుండడంతో మా దుకాణాలు, ఇళ్లు మునిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నా అధికారులు మా బాధను పట్టించుకోవడం లేదు. మళ్లీ వర్షాకాలం వస్తోందంటేనే భయమేస్తోంది. ఈ సారైనా శాశ్వత ప్రాతిపదికన మోటార్లు ఏర్పాటు చేసి మా ఇక్కట్లు తీర్చాలని కోరుతున్నాం.

– పి.రమణ, విస్తా కాంప్లెక్స్‌ చిరు వ్యాపారి

వానొస్తే మునకే!
1/1

వానొస్తే మునకే!

Advertisement
 
Advertisement
 
Advertisement