
ఖమ్మంలీగల్: దేశ భవిష్యత్ బాలలపైనే ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించి వారిని స్వేచ్ఛగా ఎదగనివ్వాలని అదనపు జిల్లా న్యాయమూర్తి(కుటుంబ న్యాయస్థానం) ఎం. అర్చనాకుమారి సూచించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యాన సోమవారం ఖమ్మంలోని బాలల సదనాన్ని న్యాయమూర్తులు అర్చన కుమారి, మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా సందర్శించారు.ఈ సందర్భంగా వారు పిల్లలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయగా.. అర్చనకుమారి చట్ట సంబంధ అంశాలను సులభ రీతిలో అర్థమయ్యేలా పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సదనం పర్యవేక్షకురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
సాంకేతిక శిక్షణ సంస్థలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంవన్‌టౌన్: మహిళ సాంకేతిక శిక్షణ సంస్థలో శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె.రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. అనాధలు, నిరాశ్రయులైన ఆడపిల్లలు, అక్రమ రవాణాకు గురైన బాధితులు, బాలల సదనం, మహిళా సంస్థల్లో ఆశ్రయం పొందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పదో తరగతి పాసైన వారు, పాలీసెట్ ప్రవేశ పరీక్ష రాయని వారు కూడా అర్హులని తెలిపారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనండగా దరఖాస్తులతో పాటు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు.ఈ మేరకు దరఖాస్తులను నూతన కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో మే 19వ తేదీలోగా సమర్పించాలని ఆయన తెలిపారు.
యువత చేతుల్లోనే
దేశ భవిష్యత్
సత్తుపల్లిటౌన్: దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని.. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును అర్హులంతా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు విధి గా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల వేళ ప్రలోభాలకు గురిచేసే వారి వివరాలను సీ విజి ల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా స్థానికులకు అవగాహన కల్పించాలని చెప్పారు. తహసీల్ధార్ యోగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ విజ య్‌కుమార్‌తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన
వేంసూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. వేంసూరు మండలం చౌడవరం, పల్లెవాడ, వైఎస్ బంజర్, అడసర్లపాడు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలతో పాటు చౌడవరం, పల్లెవాడలో ఇంటింటి ఓటరు నమోదును ఆయన పరిశీలించారు. ఆతర్వాత చౌడవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. తహసీల్దార్ ఎం.ఏ.రాజు, ఆర్‌ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్
ఖమ్మం సహకారనగర్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన ఈనెల 18వ తేదీ నుంచి కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలుకు వచ్చే వారికి సమాచారం ఇవ్వడంతో పాటు సందేహాలు నివృత్తి చేసేలా కలెక్టరేట్‌లో రెండు వైపులా రెండు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కాగా, హెల్ప్‌డెస్క్‌ల వద్దే కలెక్టర్ గౌతమ్ సూచనలతో పోలింగ్ తేదీ, సీ–విజిల్ ప్రత్యేకత, ఓటరు హెల్ప్‌లైన్ యాప్, నామినేషన్ వేసే దాఖలు చేసేందుకు కావాల్సిన పత్రాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.

పిల్లలతో న్యాయమూర్తులు

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ మధుసూదన్