ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ పంపిణీ | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పోలీసులకు మజ్జిగ పంపిణీ

Published Sun, Apr 14 2024 12:45 AM

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న దృశ్యం - Sakshi

ఖమ్మంక్రైం: మండే ఎండల్లో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసేందుకు వీఎన్‌ఆర్‌ డెయిరీ బాధ్యులు ముందుకొచ్చారు. ఈసందర్భంగా శనివా రం సిబ్బందికి ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసులు మజ్జిగ పంపిణీ చేశారు. రోజుకు 100 ప్యాకెట్ల చొప్పున నెల రోజుల పాటు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెయిరీ బాధ్యులు లింగరాజు, కమలాకర్‌, నరసింహారావు, కార్యక్రమంలో ఎస్సైలు మోహన్‌బాబు, రవి, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలకు నోటీసులు

వైరా: అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈనెల 15నుంచి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించగా.. ఓ ప్రైవేట్‌ పాఠశాల బాధ్యులు ముందుగానే నిర్వహించింది. వైరా శాంతినగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ఈనెల 8నుంచే పరీక్షలు నిర్వహిస్తుండడంతో కొణిజర్ల ఎంఈఓ మోదుగు శ్యాంసన్‌ శనివారం విచారణ చేశారు. ఇప్పటికే తెలుగు, హిందీ పరీక్షలు నిర్వహించినట్లు తేలగా ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా యజమాన్యానికి డీఈఓ సోమశేఖరశర్మ నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

‘సింగరేణి’ ఆర్వో ప్లాంట్లు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా పరిధిలోని కిష్టారం, జేవీఆర్‌ ఓసీకి పది కిలోమీటర్ల దూరాన ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటుచేయనుంది. ఈ విషయమై సంస్థ తరఫున వారం రోజులుగా సర్వే చేస్తున్నారు. రెండు ఓసీల పరిధిలో సుమారు 50 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేయనుండగా, ఒక్కో ప్లాంట్‌కు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలిసింది.

ఖమ్మం సీటు పొంగులేటి కుటుంబీకులకే ఇవ్వాలి

ఖమ్మంమామిళ్లగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికే ఖమ్మం లోక్‌సభ టికెట్‌ కేటాయించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్‌ పిడమర్తి రవి, మాజీ పీసీసీ కార్యదర్శి, తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట వేదిక చైర్మన్‌ వక్కలగడ్డ సోమచంద్రశేఖర్‌ కోరారు. మంత్రి సోదరుడు ప్రసాదరెడ్డి లేదా అదే కుటుంబానికి చెందిన రఘుమారెడ్డికి టికెట్‌ ఇవ్వాలని వారు ఓ ప్రకటనలో అధిష్టానానికి విన్నవించారు.

19న జాతీయ స్థాయి టెక్నికల్‌, కల్చరల్‌ ఫెస్ట్‌

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మంలోని బొమ్మ ఇంజనీరింగ్‌ కళాశాలలోఈనెల 19న జాతీయ టెక్నికల్‌, కల్చరల్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు కాలేజీ చైర్మన్‌ బొమ్మ రాజేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. ఈసందర్భంగా వారు ఫెస్ట్‌ పోస్టర్లను శనివారం ఆవిష్కరించగా వైస్‌ చైర్మన్‌ సత్యప్రసాద్‌ వివరాలు వెల్లడించారు.

మినప పంటకు నిప్పు

కారేపల్లి: మినప పంటకు నిప్పు పెట్టిన వ్యక్తిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలోని సూర్యతండాకు చెందిన చాందావత్‌ లక్ష్మణ్‌ తన కుమారుడు రవికి చెందిన రెండెకరాల్లో జొన్న, పెసర, మినప పంటలు సాగు చేశాడు. అయితే జొన్న, పెసర ఇప్పటికే కోయగా, మినప పంట అలాగే ఉంది. అదే గ్రామానికి చెందిన విజయ్‌ గతంలో వీఆర్‌ఓగా పనిచేయగా... రవి భూమిని ఆయన పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకున్నాడు. ఈమేరకు శుక్రవారం మినపపంటకు విజయ్‌ బావ నిప్పు పెట్టగా పంట కాలిపోయిందని లక్ష్మణ్‌ శనివా రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యువకుడిపై ‘గ్యాంగ్‌’ దాడి

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని బస్‌డిపో రోడ్డులో శనివారం రాత్రి సుమారు 25మందికి పైగా యువకులు ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన ఆ యువకుడి తండ్రిపైనా దాడి చేయడం ఉద్రికత్తకు దారితీసింది. ఈ ప్రాంతానికి చెందిన నబీ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈమేరకు శనివారం రాత్రి ఆయన ఇంటి ఎదుట ముందస్తు ప్రణాళికతో ఇద్దరు గొడవ పడుతున్నట్లు నటిస్తుండగా, నబీ బయటకు వచ్చి వివరాలు అడుగుతున్నాడు. దీంతో అక్కడే పొంచి ఉన నబీ భార్య బంధువులుగా భావిస్తున్న 25మందికి పైగా ఒక్కసారి దాడికి యత్నించారు. దీంతో నబీ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోగా.. బయట ఉన్న ఆయన తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయన దాడి చేశారు. ఈఘటనతో ఆందోళనకు గురైన స్థానికులు ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు వచ్చేసరికి వారు పారిపోయారు.

మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్న ఏసీపీ
1/1

మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్న ఏసీపీ

Advertisement
 
Advertisement
 
Advertisement