పామాయిల్‌ చెట్లకు నిప్పు | Sakshi
Sakshi News home page

పామాయిల్‌ చెట్లకు నిప్పు

Published Sat, Apr 13 2024 12:10 AM

కాలిబూడిదైన వరిగడ్డివామి - Sakshi

రూ.5 లక్షలు ఆస్తి నష్టం

కొణిజర్ల: మొక్కజొన్న రైతు దంటుకు నిప్పంటించడంతో గాలులకు పక్కనే ఉన్న పామాయిల్‌ తోటకు నిప్పంటుకుని సుమారు 250 మొక్కలు కాలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండవనమాల గ్రామానికి చెందిన రైతు ఎం.విజయలక్ష్మి సుమారు 7 ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పక్క చేను రైతు మొక్కజొన్న దంటుకు నిప్పు పెట్టగా అది పామాయిల్‌ తోటకు అంటుకుని సుమారు 250 మొక్కలు కాలిపోయాయి. పక్క రైతులు విషయాన్ని ఫైర్‌ ఇంజన్‌ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. శుక్రవారం బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొక్కలు కాలిపోవడం వల్ల రూ.5 లక్షలు నష్టం వాటిల్లినట్టు బాధిత రైతు తెలిపారు.

ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

అశ్వారావుపేట (ములకలపల్లి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. ఎస్‌ఐ రాజమౌళి కథనం మేరకు.. మండలంలోని గుర్రాలకుంట ఇసుక క్వారీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఇసుక లోడుతో ఉన్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. క్వారీలో ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న మరో ఐదు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గడ్డివామి దగ్ధం

ములకలపల్లి: మండలంలోని మాధారం గ్రామానికి చెందిన మైలగాని చంద్రమౌళికి చెందిన వరిగడ్డివామి అగ్నికి ఆహుతైంది. గురువారం అర్ధరాత్రి గడ్డివామికి నిప్పంటుకున్న విషయాన్ని గమనించి, స్థానికుల సాయంతో మంటలను ఆర్పేందుకు యత్నించారు. వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫైరింజన్‌ ఘనటాస్థలికి చేరుకొని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెండు ఎకరాలకు సంబంధించిన వరిగడ్డి కాలిపోయిందని, రూ.15 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు చంద్రమౌళి వాపోయారు. గ్రామానికి చెందిన మతిస్థితితం లేని వ్యక్తి వల్లే ప్రమాదం సంభవించిందని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

గంజాయి స్వాధీనం

భద్రాచలం(భద్రాచలంఅర్బన్‌): భద్రాచలం పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవారం టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. టౌన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని బ్యాగును పరిశీలించగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ప్రశాంత్‌ మకాడియగా తేలింది. ఆయన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, సుమారు రూ.3 లక్షల విలువ గల 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని టౌన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

గోదావరిలో లభ్యమైన మృతదేహం

భద్రాచలం వాసిగా గుర్తింపు..?

బూర్గంపాడు: పాత గొమ్మూరు వద్ద గోదావరి ఒడ్డున ఐటీసీ వ్యర్థ జలాల్లో గురువారం లభ్యమైన మృతదేహం భద్రాచలానికి చెందిన వ్యక్తిదిగా తెలుస్తోంది. భద్రాచలానికి చెందిన ఓ పాల వ్యాపారి నాలుగురోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అచూకీ కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో గోదావరిలో లభ్యమైన మృతదేహంపై ఉన్న దుస్తుల ఆధారంగా భద్రాచలానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఈ విషయమై బూర్గంపాడు ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా మృతదేహంపై ఉన్న దుస్తుల ఆధారంగా మృతుడు భద్రాచలానికి చెందిన వ్యక్తిగా ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన తరువాతనే మృతుడి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకరికి గాయాలు

ఇల్లెందు: పట్టణంలోని 19వ వార్డు దాసరిగడ్డలో శుక్రవారం ఓ వివాహ నిశ్చితార్థ కార్యక్రమం సందర్భంగా భోజనాలు తయారు చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వంట మనిషి గాయపడగా.. ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణం నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement