బరి ఖరారు..! | Sakshi
Sakshi News home page

బరి ఖరారు..!

Published Thu, Nov 16 2023 12:34 AM

సమావేశంలో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Sakshi

రేపు మణుగూరుకు రాహుల్‌గాంధీ
● త్వరలో ప్రియాంకగాంధీ పర్యటన కూడా.. ● కరటక, దమనకులమైతే మా వెంట ఎందుకు తిరిగారు? ● కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోచైర్మన్‌ పొంగులేటి

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ఈనెల 17వ తేదీ శుక్రవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రోడ్డుషో, కార్నర్‌ మీటింగ్‌ ఉంటుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోచైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటలకు రాహుల్‌గాంధీ రోడ్డుషో, ఆతర్వాత కార్నర్‌ మీటింగ్‌ ఉంటాయని... ఈ కార్యక్రమాలకు ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో త్వరలోనే ప్రియాంకగాంధీ పర్యటన కూడా ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందునే ఎక్కడ రూ.పది, రూ.20 ఇస్తారో వాటితోనే ప్రచారం సాగించాలనే తాపత్రయంతో ఉందని చెప్పారు. కానీ రూ.లక్షల కోట్లు సంపాదించి ఆ నిధులపై కూర్చోలేదని బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి ఆయన అన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు కూడా గమనిస్తున్నారని పొంగులేటి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా ఖమ్మం వైపు చూస్తోందని తెలిపారు. కాగా, తమపై ఖమ్మం, అశ్వారావుపేట పర్యటనల్లో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని, కరటక, దమనకులమైతే తమ కోసం మూడు నెలలు ఎందుకు తిరిగారని ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, కుట్రలు పన్నినా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం.. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని పొంగులేటి తెలి పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, నాయకులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌కు చెందిన రఘునాథపాలెం సర్పంచ్‌ శారద సహా పలువురు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల సమక్షాన కాంగ్రెస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement