మిగిలింది 133... | Sakshi
Sakshi News home page

మిగిలింది 133...

Published Tue, Nov 14 2023 1:54 AM

కలెక్టరేట్‌లో వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌  - Sakshi

● పూర్తయిన నామినేషన్ల పరిశీలన ● 147నామినేషన్లలో 14 తిరస్కరించాం ● పూర్తి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాం ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌

ఖమ్మం సహకారనగర్‌: శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఈనెల 3నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించగా... నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్‌ ఆఫీసర్లు సోమవారం అభ్యర్థుల సమక్షాన స్క్రూటినీ నిర్వహించారు. ఈమేరకు వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 147 మంది అభ్యర్థులు 215 సెట్ల నామినేషన్లు సమర్పించారని తెలిపారు. ఇందులో పరిశీలన అనంతరం 133 నామినేషన్లు అంతా సక్రమంగా ఉండడంతో ఆమోదించామని వివరించారు. ఇక పలుకారణాలతో 14 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు. కాగా, పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌.. ఎన్నికల సంఘం విడుదల చేసిన హ్యాండ్‌ బుక్‌లోని వివరాల ఆధారంగా సమాధానాలు ఇచ్చారు.

పరిశీలకుల సమక్షంలో..

నామినేషన్లస్క్రూటినీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని, ఇదంతా అభ్యర్థుల ప్రతినిధులు, జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుల సమక్షాన జరిగిందని కలెక్టర్‌ వివరించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నామినేషన్లను పరిశీలించి వీలైనన్ని అర్హత గలవిగా గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌లో అఫిడవిట్‌లో కొన్ని కాలమ్స్‌ పూర్తిచేయలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. అయితే, అఫిడవిట్‌ అనేది పూర్తిస్థాయి ప్రామాణికం కాదనే ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆర్‌ఓ ఆమోదించారని తెలిపారు.

ఇంకా మరికొన్ని...

● మధిర నియోజకవర్గ బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థినిగా ఎం.శారద నామినేషన్‌ దాఖలు చేయగా... బీ ఫాం ఇవ్వకపోవడంతో తిరస్కరించామని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు.

● సీపీఎం పార్టీకి చెందిన నాయకులు ఐదుగురు వివిధ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలుచేయగా.. బీ ఫాం ఇచ్చిన వారిది ఆమోదించి, మిగతావి తిరస్కరించామని చెప్పారు. పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థి నామినేషన్‌ ఏదైనా కారణాలతో రిజెక్ట్‌ అయితే వీరిది ప్రత్యామ్నాయంగా ఉంటుందని సమర్పించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇంకా మరికొన్ని సరైన వివరాలు సమర్పించకపోవడంతో తిరస్కరించామని తెలిపారు.

ప్రతిపాదకులైనా సరే...

నామినేషన్ల విత్‌ డ్రా కోసం ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు అవకాశం ఉందని కలెక్టర్‌ వెల్లడించారు. అభ్యర్థి నేరుగానైనా, లేదంటే ప్రతిపాదించిన వ్యక్తి అయిన దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉపసంహరణ గడువు అనంతరం ఎందరు అభ్యర్థుల పోటీలో ఉన్నారని వెల్లడించడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

నియోజకవర్గాల వారీగా నామినేషన్ల వివరాలిలా

నియోజకవర్గం మొత్తం ఓకే తిరస్కరించినవి

నామినేషన్లు చేసినవి

ఖమ్మం 39 36 3

పాలేరు 42 40 2

మధిర 22 17 5

వైరా 16 15 1

సత్తుపల్లి 28 25 3

మొత్తం 147 133 14

సత్తుపల్లిలో నామినేషన్లు పరిశీలిస్తున్న  అధికారులు, హాజరైన అభ్యర్థులు, నాయకులు
1/1

సత్తుపల్లిలో నామినేషన్లు పరిశీలిస్తున్న అధికారులు, హాజరైన అభ్యర్థులు, నాయకులు

 
Advertisement
 
Advertisement