దీపారాధన.. ఉపవాసం | Sakshi
Sakshi News home page

దీపారాధన.. ఉపవాసం

Published Tue, Nov 14 2023 1:54 AM

విద్యుత్‌ లైట్లతో ముస్తాబైన ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం   - Sakshi

కొత్తగూడెంటౌన్‌/భద్రాచలంటౌన్‌/ఖమ్మం గాంధీచౌక్‌: హిందూ సంప్రదాయంలో కార్తీకమాసానికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసాన్ని వ్రతాల మాసంగా కూడా పిలుస్తారు. మంగళవారం (14న) ప్రారంభం కానున్న కార్తీకమాసం డిసెంబర్‌ 13న ముగియనుంది. ఈ సమయంలో పూజలు చేస్తే పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. ఇక పెళ్లికాని యువతులు తులసి మొక్కను పూజిస్తే.. పెళ్లిళ్లు జరుగుతాయని పలువురు విశ్వసిస్తుంటారు.

పూజనీయమైన మాసం..

కార్తీకమాసం హరిహరాధులకు ప్రీతికరం. కార్తీకమాసం ప్రత్యేక పూజానీయమైనదని విశ్వాసం. ఈ మాసం ప్రాముఖ్యతను స్కంద పురాణాల్లో వివరించారు. ఈ నెలలో మహిళలు ఇళ్లు, ఆలయాల్లోనూ పవిత్రంగా పూజలు చేస్తారు. దీపారాధనలు, హోమం, అభిషేకం, సామూహిక కుంకుమార్చన తదితతర పూజలు నిర్వహిస్తారు. ఆలయాలు భక్తుల కోలాహలంతో సందడిగా మారతాయి. ఈ మాసంలో సూర్యచంద్రుల కిరణాలు మనస్సుకు, శరీరానికి మంచి ఫలితాలను ఇస్తాయని హిందూ భక్తులు విశ్వసిస్తారు. చాలా మంది శ్రీకృష్ణుడికి దీపాలు వెలిగించి పూజిస్తారు.

బ్రహ్మ ముహూర్తం..

యమునా నదిలో లేదా కార్తీకమాసంలో ఏదైన పవిత్ర నదిలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం, లేదా నదీ నీళ్లను స్నానం చేసే నీళ్లతో కలిపి చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు. పెళ్‌లైన వారు తమ పసుపుకుంకుమలు నూరేళ్లు చల్లగా ఉండాలని, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో జీవించాలని, పెళ్లికాని యువతులు తమకు అన్ని విధాలా, మంచి గుణగణాలు ఉన్న వరుడు భర్తగా రావాలని, మంచి చదువులు కావాలని, ఉద్యోగంలో రాణించాలని కోరుకుంటారు.

ఉపవాసం అత్యంతపవిత్రం

కార్తీకమాసం ప్రారంభమైన రోజు నుంచి పూర్తయ్యేవరకు నెల రోజులపాటు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసాలు చేస్తారు. ఈ నెలలో ఉపవాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మాంసాహారాన్ని పూర్తిగా మానివేస్తారు. రోజూ శాకాహారం తీసుకుంటారు.

నియమనిష్టలతో..

కార్తీక మాసంలో నియమనిష్టలతో పూజలు చేస్తారు. అందుకే భక్తులు ఈ మాసంలో అయ్యప్ప, శివమాలలధారణ చేస్తారు. ఎంతో నిష్టగా ఉంటారు. కార్తీక మాసంలో పాటించే సంప్రదాయాలతో ఆరోగ్యం, పరోపకారం, వనభోజనాలతో ఖ్యాతి, సద్బుద్ధిని కలుగజేస్తాయి. – రమాదేవి, భద్రాచలం

భక్తిశ్రద్ధలతో పూజిస్తే పుణ్యఫలం

ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన మాసం ఇది. ఈ సమయంలో నెల రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి పూజించడంతో ఉపవాసం పాటిస్తే శివుడు, విష్ణువుల అనుగ్రహం ఉంటుంది. కార్తీకమాసంలో పూజలు చేస్తే పుణ్యం లభిస్తుంది.

– రాధాకృష్ణశర్మ, గణేష్‌టెంపుల్‌, కొత్తగూడెం

ఇవీ ప్రత్యేకం

ఈ నెల 14న మంగళవారం

ఆకాశదీప ప్రారంభం

17న నాగుల చవితి

20న మొదటి సోమవారం

24న శుక్రవారం క్షీరాబ్ధి ద్వాదశి 26న ఆదివారం జ్వాలా తోరణం

27న రెండో సోమవారం

కార్తీక పౌర్ణమి

4న(డిసెంబర్‌) మూడవ సోమవారం

11న నాలుగో సోమవారం

ఆలయాల్లో సందడి..

కార్తీకమాసం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో ఘనంగా పూజలు నిర్వహించనున్నారు. కొత్తగూడెం గణేష్‌టెంపుల్‌, రైటర్‌బస్తీలోని త్రీమాతాశక్తి పంచాయత క్షేత్రం, బూడిదగడ్డబస్తీలోని శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం, రామవరంలోని సీతారామహనుమశ్శివాలయం, సింగరేణి హెడ్‌ ఆఫీస్‌ వద్ద ఉన్న శ్రీకనకదుర్గ మహేశ్వరీ దేవి అమ్మవారి ఆలయం, రుద్రంపూర్‌లోని శివాలయం, విద్యానగర్‌కాలనీలోని శివాలయం, లక్ష్మీదేవిపల్లి శ్రీచండీ సర్వజ్ఞ పీఠం తదితర ఆలయాల్లో భక్తులు కార్తీకమాసం సందర్భంగా ఘనంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.

కార్తీకమాసం ఎంతో ప్రత్యేకం

నేటి నుంచి డిసెంబర్‌ 13 వరకు..

భక్తిశ్రద్ధలతో పూజిస్తే హరిహరుల అనుగ్రహం

1/1

Advertisement
Advertisement