భూముల ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

భూముల ఆక్రమణ

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

వెలుగులోకి పొరంబోకు

సాక్షి, బళ్లారి: అధికారం ఉందనే అహంకారంతో తమ వార్డు పరిధిలోని వంక పొరంబోకు భూమిని ఆక్రమించి, ఇంటి స్థలాలుగా విభజించి విక్రయాలకు పాల్పడిన ఓ కాంగ్రెస్‌ నాయకుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బళ్లారి నగరంలోని 7వ వార్డు పరిధిలోని బాపూజీ నగర్‌ సమీపంలోని సర్వే నంబర్‌ 125లో మొత్తం 17 ఎకరాల వంక పొరంబోకు భూమి ఉంది. ఒక్కో సైట్‌ సుమారు మూడు సెంట్లు ఉండేలా విభజించి రూ.2 లక్షలకే ఇస్తానని చెప్పి పలువురిని ఆకర్షించాడు. అంతేకాక, వాటికి సంబంధించిన రికార్డులు కూడా సిద్ధం చేసి ఇస్తానని.. తన భార్య కార్పొరేటర్‌, అధికారంలో ఉన్నది తమ పార్టీ అని చెప్పి ఎవరూ అడ్డుకోలేరని నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన కొందరు డబ్బు చెల్లించి స్థలాలు కొనుగోలు చేయగా.. మరికొందరు పునాదులు కూడా వేశారు. ఒకరిద్దరు ఇళ్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు.

భూమి ఆక్రమణపై చర్యలు..

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో శుక్రవారం రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు పోలీసు బలగాల సహాయంతో జేసీబీలు తీసుకెళ్లి అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇదే తరహాలో మరో వ్యక్తి కూడా తన మూడు ఎకరాల పట్టా భూమి పక్కనే పాత్రబూదిహాల్‌ గ్రామ సర్వే నంబర్‌లో సుమారు 70 సెంట్ల వంక పొరంబోకు భూమిని ఆక్రమించాడు. రోడ్లు, సైట్లు వేసి విక్రయాలకు సిద్ధం చేసినట్లు గుర్తించి అధికారులు మెరుపు దాడి చేసి ఆక్రమణలు తొలగించారు.

ఒక్కో సైట్‌ రూ.2 లక్షలు..

ఒక్కో సైట్‌కు రూ.2 లక్షలకు పైగా చెల్లించామని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద బాధితులు తమ గోడు చెప్పుకున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వంక పొరంబోకు భూమి అని తెలియదని, న్యాయం చేయాలని వేడుకున్నారు. డబ్బు పెట్టి స్థలాలు కొనుగోలు చేసినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వే నంబర్‌ 125లోని మొత్తం 17 ఎకరాలు వంక పొరంబోకు భూమి అని.. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు నిర్మించేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. డబ్బు తీసుకున్న వారిపై కేసులు పెట్టాలని సూచించారు. సరైన ఆధారాలు లేని భూములు లేదా ఇంటి స్థలాలను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.అక్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీసీ మహమ్మద్‌ జుబేదార్‌, అసిస్టెంట్‌ కమిషన్‌ రాజేష్‌, తహసీల్దార్‌ రేఖ, డీడీఎల్‌ఆర్‌, ఏడీఎల్‌ర్‌ బళ్లారప్ప, ఆర్‌ఐలు, వీఏలు నరేంద్ర, సురేష్‌, ఉమేష్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సైట్లుగా విభజించి విక్రయించిన కాంగ్రెస్‌ నాయకుడు

పోలీసు బలగాల సహాయంతో రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారుల దాడి

జేసీబీలతో అక్రమ నిర్మాణాల తొలగింపు

Advertisement
 
Advertisement
Advertisement