మండ్య: తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదు. అంతకంటే పౌష్టికాహారమైన పాలు మరొకటి లేదని, తల్లి పాల ప్రాధాన్యతపై, తల్లి పాల దానంపై తల్లుల్లో జాగృతి కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.చలువరాయస్వామి అన్నారు. ఆయన బుధవారం నగరంలోని మిమ్స్ ఆస్పత్రిలో తల్లి పాల బ్యాంక్, సహజ కాన్పు పోషణ విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎంతో మంది తల్లుల్లో పాల కొరత ఉంటుందన్నారు. పిల్లలకు అవసరమైనన్ని పాలు ఉండవన్నారు. తల్లులకు నచ్చజెప్పి అదనపు పాలను సేకరించి నిల్వచేసి లేనివారికి అందించాలని తెలిపారు. పాలను దానం చేయడం వల్ల కొరత ఉన్న శిశువులకు అమృతపానం కల్పించినట్లవుతుందని తల్లులకు నచ్చజెప్పాలన్నారు. ఎమ్మెల్యే పీ.రవికుమార్, జిల్లాధికారి కుమార్, జెడ్పీ సీఈఓ కేఆర్ నందిని పాల్గొన్నారు.
లేఔట్ పేరుతో
రూ.7.92 కోట్ల చీటింగ్
మైసూరు: లేఔట్ నిర్మాణంలో భాగస్వామిగా చేసుకుంటానని నమ్మించి ఓ డెవలపర్ రూ.7,92,75,000 లను వసూలు చేసి మోసగించాడని ఫిర్యాదు నమోదైంది. మైసూరుకు చెందిన బీపీ శ్రీనివాసరాజు, ధర్మప్ప అనే ఇద్దరిపై ఏ.రాధాకృష్ణ అనే వ్యక్తి మైసూరు దక్షిణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. రాధాకృష్ణకు శ్రీనివాసరాజు తాను ల్యాండ్ డెవలపర్‌నని పరిచయం చేసుకున్నాడు. ధర్మప్ప కూడా డెవలపర్ అని చెప్పాడు. తామిద్దరూ హౌసింగ్ స్కీం కింద కాలనీ నిర్మిస్తామని తెలిపారు. అందుకోసం ఉత్తనహళ్లి వద్ద స్థలం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో రాధాకృష్ణను పార్ట్‌నర్‌గా చేసుకుని అడ్వాన్సుగా రూ.25 లక్షలను తీసుకున్నారు. తర్వాత దశల వారీగా కాలనీని అభివృద్ధి పేరుతో రాధాకృష్ణ నుంచి చెక్, నగదు, డీడీల ద్వారా మొత్తం రూ.7.92 కోట్లను వసూలు చేశారు. ఇప్పుడు డబ్బు వెనక్కి ఇవ్వడం లేదని, మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విద్యార్థులపై నీట్ లీకేజీ కాటు
● విద్యామంత్రి మధు
శివమొగ్గ: లీకేజీ కారణంతో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం తీవ్ర ఆందోళనకరమని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప అన్నారు. ఆయన బుధవారం శివమొగ్గలో విలేకరులతో మాట్లాడారు. పరీక్షల వ్యవస్థ తరచు ఇలా అభాసుపాలవడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతారన్నారు. ఏడాది పొడవున కష్టపడి చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్రం బాధ్యతారాహిత్య నిర్ణయాలతో నిస్సహాయ స్థితిలోకి పడిపోయారన్నారు. దీనిపై బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకొంటే చాలదన్నారు. మరింత సమర్థవంతమైన పరీక్షల వ్యవస్థను రూపొందించాలని, లేకుంటే యావత్ పరీక్షల వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పూర్తిగా పోతుందని హెచ్చరించారు.
బెంగళూరు– బీదర్ మధ్య
కొత్త రైలు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బెంగళూరు– బీదర్ మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ప్రతి శుక్ర, ఆదివారాల్లో బెంగళూరు జంక్షన్ ( నంబరు 16559) నుంచి రాత్రి 9:15 గంటలకు బయలుదేరే ఈ రైలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా బీదర్ జంక్షన్ నుంచి (నంబరు 16560) ప్రతి శని, సోమవారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూరు, యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదగిరి, వాడి, షహబాద్, కలబురిగి, తాజ్ సుల్తాన్‌పూర్, హుమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు.
గృహలక్ష్మి స్కీంలో
రూ.22 కోట్ల స్కాం
యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వ ఐదు గ్యారంటీ పథకాలలో ఒకటైన గృహ లక్ష్మీ డబ్బులు నెల నెలా సక్రమంగా పడటం లేదనే ఆరోపణలున్నాయి. లబ్ధిదార మహిళలు తరచూ ఆక్రోశం వ్యక్తంచేస్తున్నారు. కానీ దక్షిణ కన్నడ జిల్లాలో మరణించిన మహిళల ఖాతాల్లోకి ఈ పథకం పేరుతో సుమారు రూ.22 కోట్లు జమైన కుంభకోణం బయటపడింది. జిల్లాలో నిర్వహణలో లేని వేలాది ఖాతాలకు ఈ డబ్బులు పడుతున్నాయి. ఈ ఖాతాదారుల్లో అనేకమంది చనిపోయినవారే. అధికారులు కుమ్మకై ్క నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో 4.25 లక్షలు రేషన్ కార్డులుండగా, 3.82 లక్షల మంది గృహలక్ష్మీ లబ్ధిని పొందుతున్నారు. అనర్హులు పొందిన డబ్బులను వాపస్ కట్టించాలని జిల్లా గ్యారంటీల కమిటీ అధ్యక్షుడు భరత్ మండోడి జిల్లా అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు.


