శివాజీనగర: కరోనా వైరస్ వ్యాప్తి తరువాత ఆకస్మిక గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్న వయస్కలు సైతం క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే మాదిరిగా కన్నడ టీవీ, సినిమా నటుడు, నిర్మాతగా రాణిస్తున్న దిలీప్‌రాజ్ కన్నుమూశారు. అభిమానులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన వయసు 47 సంవత్సరాలు కాగా, భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
మంగళవారం రాత్రి నుంచి..
బెంగళూరులోనే జన్మించిన దిలీప్ రాజ్ చిన్ననాటి నుంచే నటనా రంగంతో ఆసక్తితో టీవీ సీరియళ్లతో పాటు పలు చిత్రాలలో నటించారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ యువతను ఆకర్షించేవారు. మంగళవారం రాత్రి ఒంట్లో బాగా లేదని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్ చేయగా, బుధవారం పొద్దున్నే రావాలని సూచించారు. కానీ బుధవారం ఉదయం ఇంట్లో ఉండగానే తీవ్రమైన గుండెనొప్పి వచ్చి పడిపోయారు. కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించిన కొంతసేపటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాలేజీ రోజుల్లోనే నటన..
దిలీప్ రాజ్ కాలేజీ రోజుల్లోనే నాటక బృందంలో చేరి నటించేవారు. ముందుగా ‘కంబద మనె’ అనే కన్నడ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. హిట్లర్ కల్యాణ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించి ప్రజాభిమానాన్ని గడించారు. ఆయన నటన, గెటప్, డైలాగ్ చెప్పే శైలి మెప్పు పొందింది. పలు సినిమాలలోనూ ప్రతిభ చాటుకున్నారు. 2005లో విడుదలైన బాయ్‌ఫ్రెండ్ సినిమా ద్వారా వెండితెరపై మెరిశారు. 2007లో పునీత్ రాజ్‌కుమార్ హిట్ మూవీ మిలనలో దిలీప్ రాజ్ నటించి ప్రశంసలందుకున్నారు. మరోవైపు డీఆర్ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా పలు కన్నడ సీరియల్స్‌లను నిర్మించారు.
సంతాపాల వెల్లువ
దిలీప్‌రాజ్ మృతిపై అనేకమంది టీవీ నటులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కొందరు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సినిమా రంగం ఒక ప్రతిభావంత నటున్ని మాత్రమే కాకుండా, స్నేహితున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. సాయంత్రం రామనగర వద్ద ఉన్న గన్నూరులోని సొంత ఫాంహౌస్‌లో రేవణ సిద్ధేశ్వరబెట్ట దాసోహ మఠాధిపతి రాజశేఖర స్వామీజీ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు జరిగాయి.
నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ మృతి
ఆకస్మిక గుండెపోటే కారణం!
సినీ రంగం, అభిమానుల దిగ్భ్రాంతి


