హొసపేటె: తాలూకాలో నాణ్యత లేని అరటి మొక్కలను సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. తాలూకాలోని రాజాపుర గ్రామానికి చెందిన రైతులు, రైతు సంఘం నాయకత్వంలో ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతు నేత ఆనంద్ మాట్లాడుతూ తమ భూముల్లో అరటి మొక్కలు నాటడం కోసం రైతులు బెంగళూరు, దేవనహళ్లి, విజయపురలోని ఆదిత్య బయోటెక్ నుంచి ఒక్కొక్కటి రూ.22 చొప్పున సుమారు 6000 మొక్కలను కొనుగోలు చేసి నాటారు. కానీ నాటిన ఆ అరటి మొక్కలు పెరిగి నిలబడక ముందే కుళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో అరటి మొక్కలను సరఫరా చేసిన కంపెనీపై చర్య తీసుకోవాలి, వ్యాధి సోకిన ఆ మొక్కలను రాయచూరు వ్యవసాయ శాఖకు పంపించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎన్.యల్లాలింగ, చంద్రు, కారె హనుమంత కరియన్న, నబీసాబ్, కనిమప్ప, ఏ.స్వామి, దురుగప్ప, గణేష్ పాల్గొన్నారు.
కంపెనీపై చర్యలకు కర్ణాటక
రాష్ట్ర రైతు సంఘం డిమాండ్


