హొసపేటె: అన్నభాగ్య పథకం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక లారీని గదగ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పోలీసులు నిర్వహించిన కార్యాచరణలో ఈ అక్రమం వెలుగు చూసింది. ఈ కేసులో ఎంపీ–09 డీఎన్–7251 నెంబరు గల లారీని సుమారు రూ.29 లక్షల విలువైన 34,720 కిలోల అన్నభాగ్య బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ లారీ విజయనగర జిల్లాలోని హరపనహళ్లి నుంచి ఇలకల్ మీదుగా గుజరాత్‌కు వెళ్తున్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెటగేరి బారంగే పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. జప్తు చేసుకున్న బియ్యం బస్తాలను కేఎఫ్‌సీఎస్‌సీ గోదాముకు తరలించారు. గదగ్ ఎస్పీ రోహన్ జగదీష్, ఆహార తనిఖీ అధికారి జగదీష్ ఆహార, పౌర సరఫరాల గోదామును తనిఖీ చేశారు.
నీట్ రద్దుపై
యూత్ కాంగ్రెస్ ఆందోళన
హుబ్లీ: నీట్ పరీక్ష రద్దును ఖండిస్తూ, విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హుబ్లీ ధార్వాడ నగర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుబ్లీలో భారీ ఆందోళన చేపట్టారు. ఇక్కడి రమేష్ భవన్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి నివాసం వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ జోషి నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత అర్జున్ పాటిల్ మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మంత్రి అయ్యాక రెండో సారి ప్రశ్నపత్రిక లీక్ అయిందన్నారు. తగిన పరిహారం చెల్లించాలని, పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు నమ్మకం కోల్పోతారన్నారు. తక్షణమే మరోసారి నీట్ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల విలీనం తగదు
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకాలోని మల్లాపుర ప్రభుత్వ పాఠశాలను విలీనం చేయడం తగదని ఏఐడీఎస్‌ఓ డిమాండ్ చేసింది. బుధవారం మల్లాపురలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నంద గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)లను ప్రారంభించిన జేగర్‌కల్‌లో మల్లాపుర పాఠశాలను చేర్చడాన్ని విరమించుకోవాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేపీఎస్‌లను ప్రారంభించిన ఆదేశాలను విరమించుకోవాలన్నారు. ఆందోళనలో నాగనగౌడ, సురేష్‌గౌడ, శంకరప్ప, సిద్దప్ప, సుశాంత్, గంగప్ప, చంద్రేగౌడ, వెంకటేష్, చెన్నబసవలున్నారు.
ఆక్రమిత భూమి స్వాధీనం
బళ్లారిటౌన్: జిల్లా యంత్రాంగం బుధవారం నగరంలోని భువనగిరి కాలనీ, అశోక్ నగర్‌లో ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనపరచుకునే ప్రక్రియను కొనసాగించింది. సర్వే నెంబర్–348లో 11.59 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించింది. ఈ భూమిలో పలు భవనాలను జేసీబీ ద్వారా ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నట్లు బోర్డును ఏర్పాటు చేశారు. ఏడీసీ మహమ్మద్ ఝుబేర, ఏసీ రాకేష్, తహసీల్దార్ టీ.రేఖ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరూ అక్రమంగా స్వాధీన పరుచుకోరాదన్నారు. ఒక వేళ అక్రమంగా స్వాధీనం చేసుకున్న వారిపై కఠినంగా, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎయిమ్స్‌ను
ప్రారంభించాలని వినతి
రాయచూరు రూరల్: రాయచూరులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎయిమ్స్ సాధన పోరాట సమితి నేతలు ఆందోళన జరిపారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సమితి అధ్యక్షుడు బసవరాజ కళస మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించాలని కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో మౌనం వహించకుండా గళం విప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో అశోక్ కుమార్ జైన్, బసవరాజ్, మారెప్ప, జాన్ వెిస్లి, అమరేగౌడ, గురురాజ్, వీరభద్రయ్యలున్నారు.


