జూన్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

May 14 2026 12:43 AM | Updated on May 14 2026 12:43 AM

సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు పలు కారణాల వల్ల ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్‌ లేకపోతే ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రుద్రప్ప పేర్కొన్నారు. ఆయన రెండు రోజుల నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో హెల్మెట్‌పై విస్తృతంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్‌ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. పోలీసుల ఆదేశాలే కాకుండా తమ ప్రాణాల రక్షణ కోసం హెల్మెట్లు వాడాలని సూచించారు. ఈమేరకు నగరంలో వాహన షోరూంలు, బార్‌ అసోసియేషన్ల వద్ద, కళాశాలల వద్ద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

హెల్మెట్‌ వాడకంతో ప్రాణాలకు రక్ష

హెల్మెట్‌ వాడకపోవడం వల్ల నగరంతో పాటు జిల్లాలో ఎక్కడో ఒక చోట ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణాలు కోల్పోతుండటం ఆవేదన కలిగిస్తుందన్నారు. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేటప్పుడు కింద పడినప్పుడు ఒక్కోసారి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారన్నారు. హెల్మెట్‌ పెట్టుకోకపోతే కుటుంబాలకు ద్రోహం చేసిన వారు అవుతారన్నారు. సాధారణంగా ద్విచక్ర వాహనాలు నడిపేది సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని, అలాంటి సందర్భంలో ఇంట్లో ఎవరైనా ప్రమాదాలకు గురైనప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతుంటారన్నారు. 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న విద్యార్థులు కూడా ద్విచక్ర వాహనాలు నడపకూడదని, కళాశాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల వెంట వెళ్లాలన్నారు. కళాశాల బస్సులు, ఆటోల్లో వెళితే ఇంకా మంచిదన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నగరంలో మంగళవారం సాయంత్రం హెల్మెట్‌ ధరించక, ద్విచక్ర వాహనం నడుపుతున్న సమయంలో సత్యవాణినగర నివాసి శివకుమార్‌(41) కిందకు పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడని గుర్తు చేశారు. మరొక వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారు ఏదో విధంగా ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారని, తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.

హెల్మెట్‌ వాడకంపై జోరుగా

అవగాహన సదస్సులు

కళాశాలలు, షోరూంలలో

జాగృతి సమావేశాలు

హెల్మెట్‌ వాడి ప్రాణాలు రక్షించుకోవాలని సూచన

Advertisement
 
Advertisement
Advertisement