ఉపాధి హామీ పనుల తనిఖీ
శ్రీనివాసపురం: శ్రీనివాసపురం తాలూకాను అవినీతి రహితంగా చేయడమే లక్ష్యమని ఉప లోకాయుక్త బి.వీరప్ప అన్నారు. తాలూకాలోని జి.తిమ్మసంద్ర, అరికుంటె, దళసనూరు, మాస్తేనహళ్లి తదితర గ్రామ పంచాయతీలను ఆయన సందర్శించి ఉపాధి హామీ, తాగు నీటి పథకాల పనులను పరిశీలించారు. నైర్మల్య నిర్వహణ, పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పనుల అమలులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బి.వీరప్ప మాట్లాడుతూ ప్రజలలో మార్పు రావాలని, అప్పుడే సమాజం మారుతుందని తెలిపారు. నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకాయుక్త న్యాయమూర్తి అరవింద్, జిల్లా లోకాయుక్త ఎస్‌పీ అంటనిజాన్, డీఎస్పీ మోనిషా, తహసీల్దార్ జీఎన్.సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు.


