గస్తీ పోలీసులకు దొంగల ముఠా బెదిరింపులు
సాక్షి,బళ్లారి: చేతిలో పిస్తోలు పట్టుకుని గస్తీ తిరుగుతున్న పోలీసులను బెదిరించి పారిపోయిన దొంగల ముఠా నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. బెళగావి జిల్లా నిప్పాణి పట్టణంలో శుక్రవారం రాత్రి పలు వీధుల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులపై దొంగల ముఠా చొరబడి భయభ్రాంతులకు గురి చేసింది. చేతిలో పిస్తోలు పట్టుకుని తిరుగుతున్న పోలీసులను బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమయ్యాయి. గుర్తు పట్టలేని విధంగా మారువేషాల్లో వచ్చిన దొంగల ముఠా ఆయా కాలనీల్లో దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు గస్తీ తిరుగుతూ కనిపించడంతో బెదిరించారు. పోలీసులు కూడా ప్రతిఘటించడంతో దొంగల ముఠా పరారయ్యారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పంచమసాలిలపై
లాఠీఛార్జి ఖండనీయం
●అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ ఆందోళన చేస్తాం
● బసవజయ మృత్యుంజయ స్వామి వెల్లడి
సాక్షి,బళ్లారి: పంచమసాలి సముదాయానికి 2ఏ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి చేస్తూ మళ్లీ పోరాటానికి సిద్ధం అవుతామని బసవజయ మృత్యుంజయ స్వామి పేర్కొన్నారు. బెళగావిలో ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మళ్లీ పెద్ద ఎత్తున జనంతో చేరి ఆందోళన చేస్తామన్నారు. డిసెంబర్ 10న మౌన ప్రతిఘటన చేస్తామన్నారు. పంచమసాలి సముదాయానికి 2ఏ రిజర్వేషన్ కల్పించాలని గత ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. పోరాటం చేసే వారిపై లాఠీఛార్జి, అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని తీవ్రంగా ఖండించారు.
అక్రమంగా తరలిస్తున్న
చౌక డిపో బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: చౌకడిపోల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న సమయంలో వాటిని అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి యాదగిరి జిల్లా గురుమఠకల్‌లో అక్రమంగా లారీలో తరలిస్తున్న రూ.7 లక్షల విలువ చేసే 220 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి అన్వర్ హుసేన్ ఆధ్వర్యంలో దాడి చేసి లారీతో సహా స్వాధీనం చేసుకున్నారు.
వేధింపులు తాళలేక
మహిళ ఆత్మహత్య
● నిందితుని అరెస్టు
సాక్షి,బళ్లారి: అన్యమతస్తుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళను తన మతంలోకి మారాలని ఒత్తిడికి గురి చేసి వేధించడంతో సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా గొణ్ణిగనూరు గ్రామంలో నాగవ్వ ఆనే మహిళ ఇతర మతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించడంతో ఆమెను తన మతంలోకి చేరాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, స్థానికులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు కారకుడైన ముక్తుంసాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యుత్ పరివర్తకాలు
ఏర్పాటు చేయండి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతుల డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ పరివర్తకాల(ట్రాన్స్‌ఫార్మర్ల)ను ఏర్పాటు చేయాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేడీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. తోటల పెంపకానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ముందుండాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, ఏసీ గజానన బళి, అధికారులున్నారు.
లేబర్ కార్డుల పంపిణీ
కోలారు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సౌకర్యాలను అందిస్తోంది, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ షఫీ తెలిపారు. శనివారం నగరంలోని 22వ వార్డు కువెంపు నగర్‌లో ఆర్థిక సాక్షరతా కేంద్రం, జిల్లా మార్గదర్శి బ్యాంకు సహకారంతో లబ్ధిదారులకు లేబర్ కార్డులను అందజేశారు. కాంగ్రెస్ నేతలు రఫీ, ఖయ్యూం, పాషా, అలమీర్ జాన్, నదీం, ప్యారూ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
గస్తీ పోలీసులకు దొంగల ముఠా బెదిరింపులు
గస్తీ పోలీసులకు దొంగల ముఠా బెదిరింపులు


