కుర్చీ కలహం మరచి..
బనశంకరి: మహిళా రిజర్వేషన్ ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం ఎందుకు వాయిదా వేస్తోందని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. శనివారం హాసన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి సిద్దరామయ్య పాల్గొన్నారు. ఇద్దరూ ఐక్యతను చాటుకునేలా అభివాదం చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య ప్రసంగిస్తూ హాసన్‌కు తామేం చేశామో చెప్పాలని కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. అసలు మండ్య జిల్లాకు కుమారస్వామి ఏమి చేశారో స్పష్టం చేయాలన్నారు. మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు తమ సర్కారు గ్యారంటీలతో పాటు అనేక పథకాలు అండగా మారాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ వసూళ్లలో నష్టం వస్తోంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయని విమర్శించారు. ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో 492 హామీలు ఇచ్చామని, ఇప్పటివరకు 242 హామీలను నెరవేర్చామని చెప్పారు. ఇప్పటివరకు 600 కోట్ల సార్లు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. జిల్లాలో హేమావతి జలాశయం కింద 700 ఎకరాల స్థలం ఉంది, అక్కడ ఉద్యానవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బేలూరు– హళేబీడు, శ్రావణ బెళగొళలో ఉద్యానవనాల స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు.
అంబేడ్కర్‌తోనే సామాజిక న్యాయం
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ మహోన్నత వ్యక్తి. దేశం గర్వించదగ్గ ఒక అపురూప నేత. దళితులకు మాత్రమే కాకుండా అన్నివర్గాలకు గౌరవం తీసుకురావడంతో పాటు పీడనకు గురైనవారి కోసం పోరాడారని సీఎం సిద్దరామయ్య తెలిపారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం విధానసౌధ ఆవరణలోని ఆయన విగ్రహానికి సీఎం సిద్దు, ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. కుర్చీ కలహాలు అన్నీ మరిచిపోయినట్లు కనిపించారు.
మనువాది కుమారస్వామి
కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామిపై సీఎం సిద్దరామయ్య ధ్వజమెత్తారు. భగవద్గీత ను పాఠ్యాంశంలోకి చేర్చాలని కుమారస్వామి కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు, బీజేపీతో పొత్తు తరువాత ఆయన మనువాదిగా మారారు అని మండిపడ్డారు.
వాచీ ధరిస్తే గొడవెందుకు?
● బీజేపీపై డిప్యూటీ సీఎం విసుర్లు
రాష్ట్ర రాజకీయాల్లో గడియారాల గొడవ జోరందుకుంది. ఖరీదైన తన కార్టియర్ వాచ్ మీద బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడంపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మరోసారి మండిపడ్డారు. నగరంలో స్పందిస్తూ నాకు ఎన్ని వాచీలైనా ధరించే శక్తి ఉంది. నేను వెయ్యి రూపాయల వాచీ కడతా, రూ.10 లక్షల వాచీ ధరిస్తా, నా జీవితం ఏమిటనేది బీజేపీ నేతలకు తెలుసు అన్నారు. ఎవరు ప్యాంట్ వేసుకుంటారు, వాచీ ఎవరు కడతారు, ఎవరు కళ్లద్దాలు పెట్టుకుంటారు అనేది అవసరమా? అది వారి వ్యక్తిగత విషయం. కొందరు రూ.వెయ్యి షూ ధరిస్తారు. మరికొందరు రూ.లక్ష విలువైన షూ వేస్తారు అని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టు అమలైతే ప్రజలకు తాగునీరు అందుతుంది. మండ్య, మైసూరు ప్రాంత ప్రజలకు కష్టకాలంలో నీరు లభిస్తుందని చెప్పారు. దేవుడు వరమో, శాపమో ఇవ్వడు, కేవలం అవకాశం ఇస్తాడు, దానిని మనం ఎలా ఉపయోగించుకున్నాం అనేది ముఖ్యమని అన్నారు. కాగా, ఆయన కార్టియర్ వాచ్‌తోనే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హాసన్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం సిద్దు, డీసీఎం శివ అభివాదం
బెంగళూరులో అంబేడ్కర్ వర్ధంతి సందర్శంగా ఖర్గేతో కలిసి నివాళులు
సభలు, సమావేశాల్లో సీఎం సిద్దు,
డీసీఎం శివ ఉమ్మడిగా హాజరు
హాసన్‌లో భారీ సభ
మహిళా రిజర్వేషన్ల కోసం
కేంద్రానికి సీఎం డిమాండ్
కుర్చీ కలహం మరచి..


