మహిళా దొంగ అరెస్టు
కోలారు: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.10.7 లక్షల విలువ చేసే 88 గ్రాముల బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని భీమగానహళ్లి గ్రామానికి చెందిన మహిళ (35) నిందితురాలు. అక్టోబర్‌లో స్థానికుడు శ్రీనివాస్ ఇంటిలో బంగారు నగలు పోయినట్లు కామసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు మీద ఆశతో చోరీలు చేస్తున్నట్లు నిందితురాలు తెలిపింది.
కాంగ్రెస్ నేత హత్య
● చిక్కమగళూరు జిల్లాలో ఘటన
బనశంకరి: చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవలో గ్రామపంచాయతీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గణేశ్‌గౌడ (38) హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి కల్కురుడేశ్వర వద్ద కారులో వెళ్తుండగా సంజయ్, మిథున్ అనే ఇద్దరు బైక్‌తో అడ్డుకుని కొడవలితో దాడిచేసి చంపారు. నిందితులు భజరంగదళ్ కార్యకర్తలని తెలిసింది. సఖరాయపట్టణలో పోలీస్ బందోబస్తు ఏర్పాటైంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ విక్రమ్ ఆమ్టె తెలిపారు. ఇద్దరు నిందితులు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు. సంజయ్, భూషణ్, మిథున్‌తో పాటు ఐదుమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యం: ఎమ్మెల్యే
మృతదేహాన్ని ఎమ్మెల్యే ఆనంద్ సందర్శించారు. ఎమ్మెల్యే ఆనంద్ బ్యానర్ తొలగింపు గురించి గొడవ జరిగి హత్యకు దారితీసిందని సమాచారం. కొద్దిరోజులుగా గణేశ్, మరో వర్గం మధ్య విభేదాలున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపించారు.
అలరిస్తున్న గ్రామీణ మేళా
బనశంకరి: రాజధానిలో రాజస్థాన్ గ్రామీణ మేళా నగరవాసులకు కనువిందు చేస్తోంది. బనశంకరి రెండో స్టేజ్ బనశంకరి మహిళా సమాజ భవనంలో మేళా సాగుతోంది.
దేశంలో పేరుమోసిన చేనేత వస్త్రాలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, గృహాలంకరణ సామగ్రి, ఆభరణాల వంటి అలంకరణ వస్తువులు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ ప్రదర్శన 14వ తేదీ వరకు నిర్వహిస్తారు.
పిల్ల పులి లభ్యం
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగరహొళె అభయారణ్యానికి ఆనుకుని ఉన్న గురుపుర టిబెటన్ కాలనీకి చెందిన జే.విలేజ్ వద్ద సుమారు 2– 3 ఏళ్ల వయస్సుగల ఆడ పులిపిల్లను అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని కాపాడారు. పులి పిల్ల తిరుగుతోందని స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వారు వచ్చి డ్రోన్ ద్వారా గాలించి పులిపిల్ల ఉన్న స్థలాన్ని కనుగొన్నారు. అటవీ శాఖ ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్‌ఎఫ్‌ఓ వినోద్‌గౌడ, డీఆర్‌ఎఫ్‌ఓ, అశోక్ శివకుమార్, వెంకటేష్ తదితరులు పులిపిల్లను క్షేమంగా పట్టుకున్నారు. దానిని అటవీ కార్యాలయానికి తరలించి పాలు, ఆహారం అందించారు. ఆ పిల్ల ఆరోగ్యంగా ఉంది. డ్రోన్ సహాయంతో తల్లి పులి కోసం గాలిస్తున్నట్లు ప్రాంత ఉప అటవీ సంరక్షణాధికారి తెలిపారు.
మహిళా దొంగ అరెస్టు
మహిళా దొంగ అరెస్టు
మహిళా దొంగ అరెస్టు


