పట్టుబడ్డ యువతీయువకులు పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు
పార్టీ జరిగిన విలాసవంత రిసార్టు ఇదే
రామనగర (దొడ్డబళ్లాపురం): అందరూ నవతరం జెన్ జీ చెందినవారు, డీజే మ్యూజిక్, కావలసిన పానీయాలు.. ఇంకేముంది యువత జోష్‌గా చిందులు వేస్తోంది. రామనగర జిల్లాలో మద్యం, మగువలతో జరుగుతున్న రేవ్ పార్టీ గుట్టురట్టయింది. ఓ హోం స్టేలో 130 మంది యువతీ యువకులు చేరి వీకెండ్ మజా చేస్తుండగా పోలీసులు భగ్నం చేశారు. కగ్గలీపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న వారందరూ 19–25 ఏళ్లలోపు యువతీ యువకులే కావడం గమనార్హం.
జెన్ జీ వాట్సాప్ గ్రూపులో ప్రచారం..
శుక్రవారం రాత్రి నుంచి తగచగెరె గ్రామం సమీపంలో ఉన్న ఆయాన్ హోంస్టేలో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. జెన్ జీ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం ఇచ్చుకుని అంతా 19–25 ఏళ్లలోపు యువతీ యువకులు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో కార్లు, బైక్‌లలో చేరుకున్నారు. సమాచారం తెలిసి పోలీసులు ఆకస్మిక దాడి చేసి పార్టీని నిలిపివేశారు. పలు రకాలు నిషేధిత మత్తు పదార్థాలు వాడినట్టు తెలుస్తోంది. యువతీ యువకులను నిర్బంధించి వైద్య పరీక్షలు నిమిత్తం రామనగర జిల్లా ఆస్పత్రికి తరలించారు.
తల్లిదండ్రుల పరుగులు
అందరూ కూడా బెంగళూరుకు చెందిన కళాశాలల విద్యార్థులే. 35 మంది అమ్మాయిలు ఉండగా, ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ పార్టీకి కానీ, హోంస్టే నిర్వహణకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. నలుగురు పార్టీ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తమ పిల్లలను పోలీసులు పట్టుకెళ్లారని తెలిసి తల్లిదండ్రులు ఠాణాకు పరుగులు తీశారు. తమ పిల్లలను ఎందుకు తీసుకువచ్చారు, వెంటనే వదిలిపెట్టాలని కొందరు ఒత్తిడి చేశారు. రేవ్ పార్టీ అనే విష వలయంలో కాలేజీ యువత చిక్కడం మీద పలువురు విచారం వ్యక్తంచేశారు.
రామనగర వద్ద హోంస్టేలో మజా
130 మంది కాలేజీ కుర్రకారు నిర్బంధం
జెన్ జీ రేవ్ పార్టీ భగ్నం
జెన్ జీ రేవ్ పార్టీ భగ్నం


