బెళగావిలో మరాఠాల నిరసన
బెళగావి (దొడ్డబళ్లాపురం): బెళగావిలో మరాఠా ఏకీకరణ సమితి (ఎంఈఎస్) ఆధ్వర్యంలో శనివారం బెళగావి నగరంతో పాటు పలుచోట్ల బ్లాక్ డే అంటూ నిరసన ర్యాలీలు జరిగాయి. కన్నడ రాజ్యోత్సవాలను నిరసించారు. బెళగావి పాలికె సభ్యురాలు వైశాలి భతకాండె సహా కొందరు ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. స్కూలు పిల్లలను కూడా తీసుకొచ్చారు. సిటీ పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే మాట్లాడుతూ ఆమైపె కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్ర సరిహద్దు దాటి రాకూడదని ఆదేశాలున్నా, వచ్చి ధర్నాలు చేసిన శివసేన నేతల మీద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఎంఈఎస్ భేటీ జరిగిన మరాఠా మందిరం వైపు దూసుకొచ్చిన పలువురు కన్నడ సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శిశువుకు డీసీఎం పేరు
దొడ్డబళ్లాపురం: కుడచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారునికి డీసీఎం డీకే శివకుమార్ నామకరణం చేశారు. ఎమ్మెల్యే మహేంద్ర తమ్మణ్ణనవర్ ఇంట్లో నామకరణ ఉత్సవానికి ఆయన వెళ్లారు. శిశువుకు శివకుమార్ అనే పేరు పెట్టారు. ఈ వేడుకకు డీకే రావాలని ఎమ్మెల్యే పట్టుబట్టి మరీ పిలిపించారు. ఈ మేరకు డీకేశి ఎక్స్‌లో రాసుకుని ఆనందం వెలిబుచ్చారు. చిన్నారికి తన పేరునే నామకరణం చేయడం ఆనందంగా ఉంది, నాకు దక్కిన భాగ్యమని, చిన్నారి భవిష్యత్తు ఉజ్వలంగా వెలగాలని కోరారు.
డీకే సీఎం అని ఎవరన్నారు?
కోలారు: ఈ నెల 21వ తేదీన డికె శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎవరైనా చెప్పారా అని మంత్రి భైరతి సురేష్ ప్రశ్నించారు. నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఇవి వదంతులని, పార్టీ పెద్దలెవరూ ఆ మాట చెప్పలేదన్నారు. ఏమైనా మార్చాలనుకుంటే అదంతా హై కమాండ్ చూసుకుంటుందన్నారు. మంత్రిమండలి విస్తరణ గురించి తనకు తెలియదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలంటున్న ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తామన్నారు.
పుష్పకు
రూ.1.58 కోట్ల టోకరా
● మైసూరులో సైబర్ వంచన
మైసూరు: మైసూరు నగరంలో తరచూ ఎవరో ఒకరు సైబర్ మోసగాళ్ల వలలో పడుతుంటారు. అధిక లాభాల ఆశ చూపి ఓ మహిళకు కేటుగాళ్లు రూ.1.58 కోట్ల మేర మోసం చేశారు. జేపీ నగరకు చెందిన పుష్ప అనే మహిళ బాధితురాలు. షేర్ల వ్యాపారం చేయాలని ఇంటర్నెట్‌లో గాలించి ఓ లింక్ నొక్కింది. ఓ వ్యక్తి కాల్ చేసి తమ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పాడు. ఆ మేరకు మహిళ ప్రారంభంలో రూ.60 వేలను పెట్టుబడిగా పెట్టారు. దుండగులు కొంత లాభం జోడించి నమ్మకం కలిగించారు. తరువాత పుష్ప దశల వారీగా రూ.1.58 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. యాప్‌లో ఆమె ఖాతాలో లాభాలు వస్తున్నట్లు చూపించారు. అయితే డబ్బు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా రూ.16 లక్షలు చెల్లించాలని వంచకులు సూచించారు. చివరకు పైసా కూడా వెనక్కి రాలేదు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
సెల్ఫీ సీఐపై వేటు తప్పదా?
దొడ్డబళ్లాపురం: బెళగావిలో శనివారం మరాఠా సంఘాల ఆందోళనల మధ్యలో సెల్ఫీ వివాదాస్పదమైంది. ఓ ఎంఈఎస్ నాయకుడు శుభం సెళకెతో మాళమారుతి పోలీస్‌స్టేషన్ సీఐ జేఎం కాలె మిర్చె సెల్ఫీ తీసుకున్నారు. కాసేపటికే అదే పోలీసు అధికారి అతన్ని ఆందోళనలో ఉండగా అరెస్టు చేశారు. ఎంఈఎస్ నేతతో సెల్ఫీ ముచ్చట్లపై సీఐ మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సీఐ పై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్రాంతి, భ్రాంతి లేదు: మంత్రి
మైసూరు: నగరంలో సిద్దార్ధనగరలోని జిల్లాధికారి కార్యాలయం ముందు భాగంలో ఈనెల 3న దేవరాజ అరసు ప్రతిమను ఆవిష్కరిస్తామని మంత్రి హెచ్‌సీ మహదేవప్ప తెలిపారు. మైసూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆ రోజున సీఎం చేతుల మీదుగా ప్రతిమను ఆవిష్కరిస్తారని తెలిపారు. నవంబర్‌లో క్రాంతి లేదు, భ్రాంతి లేదు. ఎప్పుడు ఏం జరగాలో పార్టీ హైకమాండ్ తీర్మానిస్తుందన్నారు. సీఎం స్థానంలో సిద్దరామయ్య ఉన్నారు, ఉంటారు అని అన్నారు. మంత్రి కావాలని అందరికీ ఆశ ఉంటుంది. ఆశ ఉండటం తప్పు కాదని అన్నారు.
బెళగావిలో మరాఠాల నిరసన


