
ఎడమ కాలువలో ఇద్దరు మృతి
రాయచూరు రూరల్: జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి కాలు జారి పడి దుర్మరణం చెందగా, మరో వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక కాలువలోకి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. శనివారం తుర్విహాళ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్విహాళ వద్దళెడమ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుజాత నాయక్ తెలిపారు. అదే విధంగా మస్కి వద్ద అశోక్(28) అనే యువకుడు తుంగభద్ర ఎడమ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సింధనూరు డీఎస్పీ పేర్కొన్నారు. మస్కి సహకార బ్యాంక్‌లో విధులు నిర్వహిస్తున్న అశోక్ రూ.18 లక్షల మేర అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ వెల్లడించారు. మస్కి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
భూముల స్వాధీనం తగదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని దేవనహళ్లిలో రైతుల భూములను లాక్కొన్న విధంగా జిల్లాలో కూడా భూస్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాలకు స్వస్తి పలకాలని జనశక్తి నేత మారెప్ప డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో పేద రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కోవడానికి అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని ఒత్తిడి చేశారు.
అయోధ్య రామాలయ నమూనా ప్రదర్శన
రాయచూరు రూరల్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం ఏ విధంగా నిర్మించారో అలానే నగరంలోని నగరేశ్వర ఆలయంలో నమూనాను ప్రదర్శించారు. శుక్రవారం ఆర్యవైశ్య సమాజం అధ్యక్షుడు శాస్త్రి పురుషోత్తం ఆలయంలో ఏర్పాటు చేసిన అయోధ్యలోని రామమందిరం నమూనాను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. ఈ విషయంలో భక్తులు ఆలయ పాలక మండలికి అన్ని విధాలుగా సహకరించారు.
మహిళా మండలి వార్షికోత్సవం
హుబ్లీ: విజయనగర కెంపన్నవర కళ్యాణ మంటపంలో విజయనగర మహిళా మండలి 46వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ పూజలు నెరవేర్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వినూత కులకర్ణి మాట్లాడుతూ మహిళలకు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె సమగ్రంగా వివరించారు. వివిధ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులను అందించారు. ప్రతిభావంత విద్యార్థినులను, సాధక మహిళలను ఘనంగా సన్మానించారు. ఆ మండలి అధ్యక్షురాలు సంధ్యా దీక్షిత్, కార్యదర్శి జ్యోతి దేశాయి, ఉపాధ్యక్షురాలు తార, అపర్ణ, గిరిజ, జయ కులకర్ణి, రజిని దేశాయి పాల్గొన్నారు.
విద్యాబోధన టీచర్ల బాధ్యత
రాయచూరు రూరల్: నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని హిందూ జనజాగృతి సమితి సంచాలకురాలు కృష్ణవేణి పేర్కొన్నారు. శనివారం మున్నూరువాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి ఆమె ప్రసంగించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో బాధ్యతగా పాఠాలను నేర్పాలని అన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి, భారతీ తదితరులున్నారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
బళ్లారిఅర్బన్: కరియమ్మ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఝాన్సీరాణి లక్ష్మీబాయి సమాజ సేవ సంఘం, కర్ణాటక దళిత సంఘర్షణ సమితి నేతృత్వంలో పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగ్‌లు, ఇతర వస్తువులను పంపిణీ చేశారు. పీ.భాగ్యమ్మ మాట్లాడుతూ తమ సంఘాల తరపున కొన్ని పాఠశాలలకు వెళ్లి అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి సహకారం అందిస్తున్నామన్నారు. వీటి పంపిణీ వల్ల లేని విద్యార్థులకు ఈ వస్తువులు ఉపయోగపడతాయన్నారు. డీఎస్‌ఎస్ అధ్యక్షుడు రామాంజినేయులు, ప్రముఖులు సిద్దమ్మ, ఐటీ అధికారిణి విజయలక్ష్మి, ఎస్‌ఐ లారెన్స్, సుగుణ, ఉపాధ్యాయులు శశికళ, శారద, శోభ, హెచ్‌ఎం నాసీర్ బేగం, హెచ్‌ఎం జాహుర్ బేగం, చైత్ర బీఎం పాల్గొన్నారు.

ఎడమ కాలువలో ఇద్దరు మృతి

ఎడమ కాలువలో ఇద్దరు మృతి

ఎడమ కాలువలో ఇద్దరు మృతి

ఎడమ కాలువలో ఇద్దరు మృతి

ఎడమ కాలువలో ఇద్దరు మృతి