
ప్రతి క్షణం సద్వినియోగంతో జీవితానికి సార్థకత
బళ్లారిఅర్బన్: జీవితంలో ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆదర్శ వ్యక్తిత్వం రూపొందుతుందని, జీవితానికి సార్థకత చేకూరుతుందని హంపీ హేమకూట నిరంజన జగద్గురు కొట్టూరు బసవలింగ స్వామి పేర్కొన్నారు. సదరు మఠంలో అక్కన బళగ సహకారంతో నిర్వహించిన శివానుభవ సంపద, అఖిల భారత వీరశైవ మహాసభ మాజీ రాష్ట్రాధ్యక్షుడు, మఠం అప్తుడు ఎన్.తిప్పణ్ణకు శ్రద్ధాంజలి ఘటించి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని సార్థకమయం చేసుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ దిశలో విద్య, ఆరోగ్యం, ప్రజా, ధర్మ సేవ ఇలా వివిధ రంగాల్లో సంఘాల్లో పాలు పంచుకొని ఆదర్శ జీవితం రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కన్నడ నాట 16 వేల వచనాలను ఇంటింటికి చేర్చి హలకట్టి చిరస్మణీయులు అయ్యారన్నారు. కన్నడ లెక్చరర్ బసవరాజ అమాటి ప్రత్యేక ప్రసంగం చేశారు. ముఖ్య అతిథులు సీనియర్ విలేకరి ఎన్.వీరభద్రగౌడ, తిమ్మప్ప జోళదరాశి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందుమతి పాటిల్, డాక్టర్ రేణుకా మంజునాథ్, టీచర్ ఈరమ్మ తదితరులు పాల్గొని తిప్పణ్ణకు ఘనంగా నివాళి అర్పించారు.