
పులుల హత్య కేసు.. డీసీఎఫ్ సస్పెండ్
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలే మహదేశ్వర బెట్ట అడవిలో తల్లి, నాలుగు పిల్ల పులులకు కొందరు విషాహారం పెట్టి చంపిన కేసులో సర్కారు చర్యలను తీసుకుంటోంది. విధి నిర్వహణ లోపం అనే ఆరోపణలపై ఉప అటవీ సంరక్షణాధికారి (డీసీఎఫ్) వై.చక్రపాణిని సస్పెండ్ చేసింది. ఉన్నత స్థాయి విచారణలో చక్రపాణి విధి నిర్వహణలో లోపం ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఏప్రిల్ జీతాలు విడుదల అయినప్పటికీ జూన్ వరకు వాటిని చెల్లించకుండా కాలం గడిపారు.
దీనివల్ల ఆ సిబ్బంది గస్తీ విధులకు రాలేదు. మార్చి 3 నుంచి 3 నెలల వేతనాలు రాలేదని జూన్ 23న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అడవుల్లో గస్తీ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అవకతవకలకు చక్రపాణి కారణమని తేల్చి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు జిల్లాను విడిచి వెళ్లరాదని ఆయనను ఆదేశించింది.