
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
రాయచూరు రూరల్: నగరంలోని సూగూరేశ్వర పాఠశాల చైర్‌పర్సన్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. సోమవారం రాత్రి బెంగళూరులో కావ్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కన్నడ సాహిత్య సంభ్రమ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షురాలు సులోచనకు ట్రస్ట్ పదాధికారులు, సభ్యులు అవార్డు ఇచ్చి సత్కరించారు.
విద్యార్థులకు సన్మానం
సాక్షి, బళ్లారి: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యం వైపు పరుగులు తీయాలని జిల్లా ఎస్‌పీ శోభారాణి పేర్కొన్నారు. మంగళవారం నగరంలో ఓ కళ్యాణ మండపంలో ఓం సాయి పూజితా ట్రస్టు ఆధ్వర్యంలో 10 తరగతి, పీయూసీలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ట్రస్టు నిర్వహకులు రాఘవేంద్ర,సునితా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కోతి దాడిలో బాలిక మృతి
హొసపేటె: కోతి దాడితో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక మరణించిన సంఘటన నగరంలోని చలవాదికేరిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు.. చలవాదికేరి నివాసురాలైన అనన్య(4) మరణించిన బాలిక. ఆమె పెరుగు తేవడానికి దుకాణానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా రోడ్డుపై కనిపించిన కోతి దాడి చేసిన ఫలితంగా బాలిక అనన్య తలకు తీవ్ర గాయమైంది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. రెండు రోజుల తర్వాత ఆ బాలికకు తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని మళ్లీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్యుడి సలహా మేరకు ఆ చిన్నారిని కొప్పళ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెదడుకు గాయం కావడంతో బాలిక కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. ఎనిమిది రోజులుగా కోమాలో ఉన్న బాలిక తుది శ్వాస విడిచింది. బాలిక మృతితో ఆమె ఇంటిలో విషాదం నెలకొంది.
పన్ను మినహాయింపుపై సమాలోచన
రాయచూరు రూరల్: వ్యాపారులకు ఆదాయ పన్ను మినహాయింపుపై సమాలోచన చేసినట్లు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ తెలిపారు. సోమవారం రాయచూరు వాణిజ్యోద్యమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆదాయ పన్ను చట్టం– 2025 గురించి వివరించారు. సీఏలకు డిజిటల్ డివైస్ వాడకంతో వ్యాపారులకు ముప్పుగా మారుతుందన్నారు. కార్యక్రమంలో వాణిజ్యోద్యమ సంఘం అధ్యక్షుడు కమల్ కుమార్, జంబణ్ణ, నగరసభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, చేతన్, సుధీర్, రంజిత్, పాటిల్, లక్ష్మిరెడ్డి, ఉదయ్ కిరణ్, మల్లికార్జునలున్నారు.
గ్రామంలోకి ఏనుగు
హోసూరు: డెంకణీకోట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల మంద నుంచి ఓ ఏనుగు విడిపోయి సోమవారం రాత్రి గ్రామానికి చొరబడడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో మనియంబాడి, ఆలహళ్లి గ్రామాల్లోకి చొరబడి తీవ్ర సంచలనం సృష్టించింది. అదృష్టవశాత్తు జన సంచారం లేకపోవడంతో ఎవరికీ హాని కలగలేదు. అటవీశాఖాధికార్లు ఏనుగును దట్టమైన అటవీ ప్రాంతానికి మళ్లించాలని ప్రజలు కోరారు. గత కొద్ది రోజులుగా ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం