
సదస్సులతో ఉద్యోగులకు తోడ్పాటు
హొసపేటె: ప్రజాసేవలో శాంతిని కలిగించే విధంగా మీరు మీ విధులను నిర్వర్తించినప్పుడు, మీరు పని ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారని రిసోర్స్ పర్సన్ నాగరాజ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని పర్యాటక మందిరంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది కోసం జీవన్ సంగీత సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్వహణపై సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను ఒత్తిడి లేకుండా నిర్వర్తించగలగాలన్నారు. అందుకోసం వారు తమ పనిలో విధేయత, నిబద్ధత, నిజాయితీ కలిగి ఉండాలన్నారు. సమస్యలు తలెత్తకుండా ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వాటికి ప్రతిస్పందించే దిశగా వారు ముందుకు సాగాలన్నారు. క్రమం తప్పకుండా రోజు వారీ నడక, వ్యాయామం, ధ్యానం వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మనస్సుకు ఆనందం కలుగుతుందన్నారు. అనంతరం తహసీల్దార్ వీకే.నేత్రావతి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఉద్యోగులు తాలూకాలో తమ విధులను బాగా నిర్వహిస్తున్నారు. వృద్ధులు, మానసిక దివ్యాంగులు, మహిళలు సహా ప్రజలకు మంచి సేవలను అందించడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్నారు. వారు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఒత్తిడి లేని రీతిలో తమ విధులను నిర్వర్తించాలని కోరారు. సంగీత జీవన్ సంస్థ అధ్యక్షురాలు గీతా వీరేష్, సంస్థ కార్యదర్శి సతీష్ శేష్, రాఘవేంద్ర, సిద్ధి వినాయక్ పాల్గొన్నారు.