
సిరిగంధం అలంకరణ
బొమ్మనహళ్లి: ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో గ్రామదేవత మారెమ్మదేవిని విశేషంగా అలంకరించారు. అర్చకులు వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం సిరిగంధంతో అలంకరించి పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని నిమ్మదొప్పెలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
భట్కళ పట్టణం పేల్చేస్తామని బెదిరింపు
బనశంకరి: ఉత్తరకన్నడ జిల్లా భట్కళ పట్టణం పేల్చేస్తామని దుండగులు భట్కళ శహర పోలీస్‌స్టేషన్‌కు గురువారం ఉదయం 10.30 గంటలకు ఇ–మెయిల్ పంపారు. దీంతో పోలీసులు బస్టాండ్, రైల్వేస్టేషన్‌తో పాటు ప్రముఖ స్థలాల్లో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు కనబడకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
కలప గోదాము దగ్ధం
దొడ్డబళ్లాపురం: కలప గోదాము అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన నెలమంగల తాలూకా కెంపలింగనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో మహేశ్ అనే వ్యక్తి ప్‌లైవుడ్ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే లక్షల విలువ చేసే సరుకు కాలిపోయింది. నెలమంగల రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
సిద్దరామయ్యే సీఎంగా కొనసాగుతారు
● మంత్రి కేహెచ్ మునియప్ప
కోలారు: రాబోయే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యే కొనసాగుతారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పు గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఓడీసీ సలహా మండలిలో పలువురు నాయకులు ఉన్నారు. సిద్దరామయ్య ప్రస్తుతం ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయనను కూడా చేర్చుకుని బాధ్యతలు అప్పగించారన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని పలువురు స్వామీజీలు అంటుండడంపై మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి కావాలని ఆయన శ్రేయోభిలాషులు ఆకాక్షించడంలో తప్పు లేదు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదన్నారు. ఈడీ అధికారులు కాంగ్రెస్ నాయకులపై దాడులు నిర్వహించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. దురుద్దేశ పూర్వకంగానే ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది బీజేపీకి శోభను తీసుకు రాదు, ఇలా చేయవద్దని తాను చాలా సార్లు చెప్పానన్నారు.

సిరిగంధం అలంకరణ

సిరిగంధం అలంకరణ