
అధికారులకు జెడ్పీ సీఈఓ క్లాస్
రాయచూరు రూరల్: రాయచూరు జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉద్యోగులకు, అధికారులకు, సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. బుధవారం అకస్మాత్తుగా కార్యాలయంలో విధులకు హాజరైన వారి పని తీరును జెడ్పీ సీఈఓ పరిశీలించారు. వారానికి ఒకసారి స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని, రికార్డులను భద్రపరుచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
రైలు కింద పడి
తల్లీబిడ్డల ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: రైలు కింద పడి తల్లీ, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన దావణగెరె జిల్లా హరిహర తాలూకాలోని తుంగభద్ర నది వంతెన వద్ద చోటు చేసుకుంది. గంగనరసి గ్రామానికి చెందిన సువర్ణమ్మ(65), గౌరమ్మ(45) ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీ, కుమార్తె. రైలు పట్టాలపై పడుకుని ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.