
బ్యాంకు రుణాలకు గ్యారెంటీ సొమ్ము జమ తగదు
రాయచూరు రూరల్: ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ప్రభుత్వం నుంచి గ్యారెంటీల ద్వారా అందించే సొమ్మును జమ చేసుకోవడం తగదని పంచ గ్యారెంటీల అమలు సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి పేర్కొన్నారు. బుధవారం జిల్లా పంచాయతీ జలనిర్మల సభాంగణంలో జరిగిన పంచ గ్యారెంటీల అమలు సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పంచ గ్యారెంటీల నుంచి మహిళల బ్యాంక్ పొదుపు ఖాతాలకు డబ్బులు పడిన వెంటనే బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని జమ చేసుకునే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. గృహలక్ష్మితో పాటు వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్ పథకాల నుంచి వచ్చే నిధులను బ్యాంక్ అధికారులు జమ చేసుకోకుండా ఖాతాదారులకు అందించాలన్నారు. సమావేశంలో సభ్యులు శంకరగౌడ, నజీర్ పంజాబి, బసవరాజ్, అధికారులు చంద్రశేఖర్, హుడేద్, నవీన్ కుమార్, హరీష్, గవిసిద్దప్పలున్నారు.