
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి,బళ్లారి: పరాసుర మహర్షి, మత్య్సగంధికి జన్మించిన కారణజన్ముడు, మహాభారతాన్ని రచించిన మహానుభావుడు, వేదవేదాంగాలను ఔపోసన పట్టిన వ్యాసుడు పుట్టిన రోజున జరుపుకునే గురుపౌర్ణమి వేడుకలు గురువారం రోజున గురు పౌర్ణమి రావడం గురు భక్తులకు మరింత పరమపవిత్రం కావడంతో నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని విశాల్‌నగర్‌లో షిర్డీలో వెలసిన శ్రీ షిర్డిసాయి బాబా ఆలయం తరహాలో నిర్మించిన సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్నదానం చేపట్టారు. ఆలయ ధర్మకర్త కుమారస్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో వద్ద రక్తదాన శిబిరంతో పాటు అన్నదానం నిర్వహించారు. ఆలయంలో శ్రీ షిర్డిసాయిబాబాను దర్శించుకునేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అలాగే కోట ప్రాంతంలో వెలసిన శ్రీషిర్డిసాయిబాబా ఆలయం, పటేల్‌నగర్‌లో వెలసిన శ్రీ షిర్డిసాయిబాబా ఆలయంతో పాటు శ్రీ గురురాఘవేంద్ర స్వామి ఆలయాల్లో కూడా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద అన్నదాన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ భక్తిని చాటుకున్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్ : నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లోని సాయి బాబా ధ్యాన మందిరంలో గురువారం ప్రత్యేక పూజలను సాయి బాబా ధ్యాన మందిరం ట్రస్టీ కిరణ్ ఆదోని నిర్వహించారు.కాకడ హారతి, మహారుద్రాభిషేకం, పుష్పాభిషేకం, సాయి సత్యనారాయణ పూజలు, పల్లకీ సేవలు, ధూప హారతి, అన్న దాసోహ కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా రాజేష్ మడివాళ, ప్రవీణ్ ప్రభ శెట్టర్, కేశవమూర్తి, ఈరన్న, అన్వర్ పాషా, తానాజీలున్నారు. గురువందన ఉత్సవాలను నగరంలోని గురు పీఠానికి చెందిన కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యులు అభిషేకం, పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. తాలూకాలోని మిట్టి మల్కాపూర్ సిద్దారూఢ మఠంలో గురు పౌర్ణిమ ఉత్సవాల్లో గురువును ఆరాధించి, పూజలు చేశారు.
మంత్రాలయంలో..
మంత్రాలయ మఠం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. గురువారం గురు పౌర్ణమి కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. మంత్రాలయ మఠంలో రాఘవేంద్రస్వాముల పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం రాత్రి మంత్రాలయ మఠంలోకి భక్తులు రావడంతో మంత్రాలయం మఠం జనసందోహంతో కిక్కిరిసింది. రాయల వారిని దర్శనం చేసుకోవడానికి ఆరేడు గంటల పాటు సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. ముఖ ద్వారం నుంచి రాయల ప్రాంగణం వరకు భక్తుల సందోహం కనిపించింది. సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఆలయంలో ప్రదక్షిణం చేశారు.
హొసపేటెలో..
హొసపేటె: గురుపౌర్ణమి సందర్భంగా గురువారం నగరంలో సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకున్నారు. నగరంలోని టీబీ డ్యాం రహదారిలో ఉన్న సాయిబాబా మందిరం, రైల్వే స్టేషన్ రహదారి, హంపీ రహదారిలో కొండనాయకనహళ్లిలో ఉన్న సాయిబాబా ఆలయాలకు భక్తులు భారీగా చేరుకొని సాయినాథుడికి పూజలు చేశారు. విజయనగర జిల్లా వ్యాప్తిలో ఉన్న కూడ్లిగి, హడగలి, కొట్టూరు, హరపనహళ్లి, హగరిబొమ్మనహళ్లి తాలూకాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకున్నారు.
ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు
జోరుగా అన్నదానం, రక్తదాన శిబిరాలు