
సీఎం కుర్చీ పంపకం ఉత్తిదే
హస్తిన టూర్‌ని సీఎం సిద్దరామయ్య అనువుగా మలచుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ఒక్కొక్కరు ముఖ్యమంత్రిగా ఉండాలన్న నియమం ఏదీ లేదని కుండబద్ధలు కొట్టారు. పైగా పోటీదారు డీకే శివకుమార్‌కు ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదని చెప్పి తనకెవరూ పోటీ కాదని సంకేతాలిచ్చారు. ఈ పరిణామాలతో హస్తం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో? అనే చర్చకు బీజం పడింది.
శివాజీనగర: 5 సంవత్సరాలూ నేనే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటాను అని సీఎం సిద్దరామయ్య ఢిల్లీలో తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశానని అన్నారు. జూలై 2న చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం పదవి పంపకాలు చేసుకోవాలేది మాట్లాడుకోలేదన్నారు. తానే ముఖ్యమంత్రి కు ర్చీలో ఉంటానని చెప్పడం ద్వారా డీకేశి, ఆయన అనుచరుల ఆశలపై నీళ్లు చల్లారు. మాది హైకమాండ్ ఆధారంగా నడిచే పార్టీ, 2023 సమావేశంలో రెండున్నరేళ్ల సీఎం కుర్చీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. తాము చెప్పిన దానిని అనుసరించాలని హైకమాండ్ ఆదేశించింది, వారు ఏమి చెప్పినా దానిని తాము అనుసరించాలి. నేను అదే చేస్తారు, డీకే శివకుమార్ కూడా అనుసరిస్తారని సిద్దు చెప్పడం ద్వారా మరో మాటకు తావు లేదని స్పష్టీకరించారు. సీఎం కావాలని డీకే కూడా కోరుకుంటున్నారు అని విలేకరులు ప్రశ్నించగా, డీకే కూడా సీఎం ఆకాంక్షి. అందులో ఎలాంటి తప్పులేదు. అయితే సీఎం కుర్చీ ఖాళీగా లేదని ఆయన నోటి నుంచే చెప్పారు. సీఎం పదవి గురించి సుర్జేవాలా ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. డీకే శివకుమార్‌కు మద్దతు పలికే కొందరు ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఉంటారు. అయితే అధిక సంఖ్యలో లేరు అని తెలిపారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని సిద్దు పరోక్షంగా ప్రకటించారు. దీంతో సీఎం మార్పు చర్చలకు పుల్‌స్టాప్ పెట్టారు.
ఇప్పుడేం చేయాలి.. డీకేశి
ఐదేళ్లూ నేనే పదవిలో ఉంటా
సీఎం సిద్దరామయ్య ప్రకటన
ఢిల్లీలో కన్నడ రాజకీయం
డీకేశి శిబిరంలో నిరుత్సాహం
నేను డ్రామాలు ఆడను: హోంమంత్రి
సీఎం పదవి మార్పు వార్తలు, పార్టీ పరిణామాల మీద హోంమంత్రి పరమేశ్వర్ కొత్తగా స్పందించారు. మీరు చెప్పినట్లుగానే డ్రామా జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇంకేమీ లేదు అని అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అనవసరంగా డ్రామా కంపెనీని పెట్టడం నాకు ఇష్టం లేదని అన్నారు. సీఎం రేసు, ఢిల్లీ టూర్‌లో తాను లేకపోవడం గురించి ఇలా చెప్పారు. సీఎం మార్పు గురించి తరచూ చర్చించడం, ఏదో ఒకటి చెప్పడం సరికాదు, హైకమాండ్ అన్నింటినీ గమనిస్తుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు నిర్ణయాలను తీసుకొంటుందన్నారు.
ఇక పోస్టు మార్పు లేనట్టేనా?
సీఎం సిద్దరామయ్య విస్పష్ట ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. ఆయన అభిమాన ఎమ్మెల్యేలకు ఉపశమనం కలిగించగా, డీకేశి వర్గంలో నిరుత్సాహం చోటుచేసుకుంది. సీఎం ఆ మాటను బెంగళూరులో చెప్పి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఢిల్లీలో, రాహుల్‌గాంధీ, ఖర్గే తదితర అగ్రనేతలతో సమావేశం తరువాత అంత స్పష్టంగా చెప్పారంటే, ఇక డీకేశికి ఈ దఫా ముఖ్యమంత్రి పదవి దక్కడం సులభం కాదని రెండు వర్గాలు భావిస్తున్నాయి. సీఎం సిద్దరామయ్య ఎంతో ప్లాన్‌గా ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకుని డీసీఎంకు చెక్ పెట్టినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది. డీకే ఇంకా స్పందించినట్లు లేదు.

సీఎం కుర్చీ పంపకం ఉత్తిదే

సీఎం కుర్చీ పంపకం ఉత్తిదే