శివమొగ్గ: హైవేలో వెళ్తున్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. శివమొగ్గ నగర శివార్లలోని త్యావరెకొప్ప పులి సింహధామం వద్ద బుధవారం రాత్రి జరిగింది. శివమొగ్గవాసి వీరేష్ హుండై ఐ20 కారులో ఇంటి నుంచి తోటకు వెళుతుండగా ఆకస్మికంగా కారులో పొగ వ్యాపించింది. వెంటనే కారును రోడ్డు పక్కన నిలపగా మంటలు ఎగసిపడి కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు దాదాపుగా కాలిపోయింది. తుంగానగర పోలీసులు పరిశీలించారు. మంటలకు కారణాలేమిటి? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
గజ దాడిపై జనాందోళన
దొడ్డబళ్లాపురం: అడవి ఏనుగు దాడిలో రైతు కాలు విరిగిన సంఘటన కనకపుర తాలూకా నారాయణపుర గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45) పొలంలో పని చేస్తుండగా హఠాత్తుగా వచ్చిన అడవి ఏనుగు తొండంతో కొట్టి తొక్కింది. రైతు కాలు విరిగి గాయాలపాలయ్యాడు. స్థానికులు అతనిని కాపాడి తీసుకొచ్చారు, శ్రీనివాస్‌ను రోడ్డుమీదే పడుకోబెట్టి ఆందోళన చేశారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు వచ్చి బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు.
న్యూస్‌రీల్
హఠాత్తుగా కారు దగ్ధం