శివాజీనగర: సిలికాన్ సిటీలో రోడ్లపై వెళ్తున్న మహిళలు, యువతుల ఫోటోలు, వీడియోలు తీసి ఇన్‌స్టా గ్రాంలో పోస్టు చేస్తున్న పోకిరీని పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల రీతిలో చిత్రీకరించి పోస్టులు పెట్టేవాడు. చర్చ్ స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ సహా జనసమ్మర్ధ ప్రాంతాలలో ఈ అకృత్యానికి పాల్పడుతున్న గురుదీప్ సింగ్ (26) ని బనశంకరి పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ మేనేజ్‌మెంట్ చేసి నిరుద్యోగిగా తిరిగే గురుదీప్ సిటీలో కేఆర్ పురంలో సోదరుని ఇంట్లో ఉండేవాడు. ఇటీవల ఓ యువతి తన వీడియోలను ఇన్‌స్టాలో చూసి కంగుతిని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో పోలీసులు అతని ఇన్‌స్టా ఖాతాను పరిశీలించగా చాలామంది మహిళలు, యువతుల వీడియోలు దర్శనమిచ్చాయి. వాటి మీద అసభ్య కామెంట్లు కూడా ఉన్నాయి.
యువతి ఆక్రోశం
నా అంగీకారం లేకుండా చిత్రీకరించాడు, ఆ పోస్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని యువతి వాపోయింది. ఆ వీడియో కింద అశ్లీల వ్యాఖ్యలు వస్తున్నాయి అని గోడు వెళ్లబోసుకుంది. పోకిరీ ఎక్కువగా చర్చ్ స్ట్రీట్‌లో అమాయకునిలా తిరుగుతూ చిత్రీకరిస్తూ ఉంటాడని గుర్తించారు. బాధితురాలు తన పోస్టును బెంగళూరు సిటీ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీసులకు ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
వీధుల్లో మహిళల వీడియోలు తీసి పోస్టింగ్
రీల్స్ సైకో